పుట:కాశీమజిలీకథలు-12.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శబరబాలకుని కథ

67

నాలుగుదిక్కులంగూడ దివ్యగానము శాఖాగ్రములనుండి వినంబడుచు నిశాంతమున కంతయు శాంతమగుచుండుట కా శబరబాలకుండు భయవిస్మయావేశహృదయుఁడై దానిమూలమిదియని గ్రహింపఁజాలక యైదవదినమున నొకమారుమూలదారింబట్టి పోవు చుండెను ఆ ప్రశాంత ప్రభాతమున శీతలవాతపోతములు మేనికి సుఖముగూర్చు చుండెను. ఇంతలో నొకదండనుండి వేదండఁబొండు ప్రచండవేగమున ఘీంకరించుచు వానియండకు రాఁదొడంగెను ఆ ధ్వనితోడనే వానికి ప్రాణము లెగిరిపోయినట్లయ్యెను. జీవితాశచే నెట్లో యా పెట్టెలో దూరి‌ మూతఁ బిగించుకొనెను. ఆ యడవియేనుఁగు తిన్నఁగా మందసము దాపునకువచ్చి తొండముసాచి దానింబట్టుకొని యతిరయమున నెచ్చటికో పోవుచుండెను. పెట్టె సందునుండి చూచుచున్న యాబాలునకు జీవితాశ పూర్తిగా వదలినది‌. నాఁడే తన జీవితపరమావధియని తలంచుచుండెను. ఆ వేదండ శుండాదండమునుండి తప్పించుకొనఁగల్గుట కల్లయని నిశ్చయించుకొనెను. ఆ పెట్టె మూఁత యెప్పుడు విడిపోవునో యెచ్చట క్రిందఁబడి చూర్ణీభూతగాత్రుండనగుదునో యని యడుగడుగునకు భయపడుచుండెను. ఇంతలో నయ్యనేకపముఖ్యంబొక లోయలో దిగి నడచుచుఁ గ్రమమున నొకవిశాలప్రదేశమునఁ గల కమలాతీరముజేరి యాపెట్టె నందుఁ బడవైచి యాకొలనిలోనికిదిగి‌ తొండమున నీరముల బూరించి పైకెగఁ జిమ్ముచు బద్మకాండముల మూలములతో నూడఁబెరుకుచుఁ బెద్దతడవందు జలవిహార మొనరించి తనివిఁజెంది జలము వెడలివచ్చి యయ్యరణ్యమునఁబడి నిముసములో నదృశ్యమయ్యెను.

ఇంతలో నల్వురుజవ్వనులు ముచ్చటలాడుకొనుచు నప్పద్మాకరంబున కేతెంచి మించిన యానందమున సంబరముల దీరమున బెట్టి యొండొరుల చేతులం బట్టుకొని యాసరోవరమున దిగి యధేచ్చగా జలవిహారము సేయఁదొడంగిరి. ఆ లేఁజవరాండ్రు సమానవయోరూపవిలాసజాతుర్యములం గలిగి యొండొరులపై జలము జల్లుకొనుచుఁ బందెములు వై చికొని యీదులాడుచు నొకరినొకరు పరిహాసము లాడు కొనుచు నీరెగజిమ్ముచు నరచేతులతోఁ దపతప తట్టుచు నెదురనున్న వారిపై నీరు ధారగాఁ బడునట్టుముప్టినిష్పీడనము తొనరించుచుఁ బెద్దతడ వందు జలక్రీడా వినో దములఁ బ్రొద్దుపుచ్చిరి.

మందసములోనుండి శబరబాలకుండు దత్క్రీడా విశేషములఁ జూచు చుండెను. ఆ సీమంతినీ రత్నముల యంగసౌష్టవమునకు విస్మయమందుచుండెను. వారి యపురూపపు రూపలావణ్యముల కద్భుతమందుచుండెను. పిమ్మటఁ గొంత సేపటి కా యంగనామణులు జలక్రీడలుచాలించి తీరమున కేతెంచి పుట్టములంగట్టికొని పటురయ మున నందొక మార్గమున బట్టిపోయిరి. వారరిగిన తరువాత శబరబాలకుండు మంద సము వెలువడి యాయన్నుమిన్న లరిగినదారినే వారినరయు దలంపునఁ బోయెను. ఇట్లు కొంతదూరమేగువరకు ముందు వానికొక దేవాలయము దృగ్గోచరమయ్యెను.