పుట:కాశీమజిలీకథలు-12.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

మృత్యుముఖమునుండి యీవలబడినట్లు తలంచుచు నా శబరబాలకుడు దనకట్టి సందిగ్ధ సమయంబున బ్రమాదరహితంబగు నుపాయమును దోపింప జేసి యా యాపద దప్పించిన పరమేశ్వరుని మనమున స్తుతించుచు నా పెట్టి వెడలివచ్చి దానింబట్టుకొని యొక దారింబడి నడువసాగెను. ఎదుర నెచ్చటనైన దుష్టమృగములు దారసిల్లినపుడు వెనుకటివలనే పెట్టెయందు దూరియుండి యవి వెడలిపోయిన పిమ్మట నడక సాగించు చుండెను. ఇట్లు నిర్భయముగా సాయంసమయమగువరకు నా యరణ్యమందు దిరుగు చుండెను. కాని యెప్పటికిని దాని యంతము వానికి దొరికినదికాదు. తిరిగినచోటనే తిరుగుచు నెక్కినమెట్లలే యెక్కుచు జూచిన ప్రదేశమునే చూచుచు నేమి చేయుటకుం దోచక విభ్రాంతుడగుచుండెను. అంత గొంతసేపటికి చీకటి దెసల నాక్రమింప సాగెను. కందమూలంబులదిని యాకటిచిచ్చు జల్లార్చుకొని యా పెట్టెనే శరణ్యముగ నెంచి యొక విశాల తరుమూలంబున నారాత్రి గడుపనెంచి యందు జేరెను. మృగభీతిచేబయల బరుండనోడి యా పెట్టిలోనే శయనించెను. ఆ మందసము దగినంత వైశాల్యము గలిగి నలువైపుల గవాక్షములవలె రంథ్రము లుండుటచే వానికొక చిన్న శయనమంది రమువలె నొప్పియుండెను. ఎంత నిర్భయముగా వాడందు శయనించినను నుక్క చే వాని కించుకేని యా రాత్రి నిద్రపట్టలేదు.

అర్ధరాత్రమగు సమయమున నా శాఖాగ్రమునుండి సంగీతధ్వని వానికి వినబడ జొచ్చెను. దాని కబ్బురంపడుచు బైటకేతెంచి తత్కారణమరయుటకు భయము గలిగి తెల్లవారుఱకు పెట్టైలోనే యుండి యాగానమాధురి నా శబరబాలకుం డనుభ వింపుచుండెను. సంగీతమేమో యెరుంగని యా కిరాతునకు గూడ నా గానమువలన నపరిమితానందముగలిగి వాని యవస్థనంతయును మఱవజేసెను. తెలవారుసరి కాగానము ముగిసినది. పెట్టె సందులలోనుండి వెలుగులోనికి బ్రసరించుచుండెను. వివిధశకుంత సంతాన సంకులనిస్వనంబు వలన నా ప్రభాతం బతి మనోహరమయ్యెను. వాడప్పుడు పెట్టెనుండి బైటకేతెంచి రాత్రి సంగీతము పాడిన గాయకుని కొఱకై యా చెట్టుకొమ్మ లన్నియును బరిశీలింప దొడంగెను. కాని యందెవ్వరి జాడయును గనిపింపలేదు. ఆ వృక్షము నాశ్రయించి పిశాచమెద్దియైన నట్లు గాన మొనర్చెనేమో యని వానికి మన మున భయము బుట్టెను. ఆ ప్రదేశమున నుండుట యనర్దదాయకమని తలంచుచు నప్పుడే పెట్టెతో నటఁగదలి మఱొక దారింబట్టిపోయెను ఆ దివసాంతమువరకుఁ దిరిగి రాత్రికొక తరుమూలమునఁజేరి యధాప్రకారము మందసమున దూరియుండెను. వెను కటిరీతినే యర్ధరాత్రము మొదలు తెల్లవారు వరకు దివ్యగానము వానికి వినంబడు చుండెను. మరునాఁడు వేరొకవైపునకుఁబోయి రాత్రియగుసరి కింకొక వృక్షమూలమునఁ బెట్టెలోఁబరుండెసు. అచ్చటఁగూడ వానికి సంగీతధ్వని వినవచ్చెను. నాల్గవదివసమున వేరొక దిక్కునకుఁబోయి యారాత్రి మరొక్కపాతపముక్రింద మందసమున శయ నించెను. అచ్చటసైతము గీతనాదము వానికి శ్రవణానందముగ వినంబడెను. ఇట్లు