పుట:కాశీమజిలీకథలు-12.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అరిందమునికథ

63

ఈ లోకమాత నికటంబును జేర మరణదేవత భీతిఁజెందవచ్చును. ఈలోకేశ్వరికి జీవ హింస గిట్టదనుటకిది నిదర్శనముగాదా ? ఈమె సన్ని ధానమునఁ బశులిశసనం బొన రించి కోర్కెలం బడయ నెంచుట యవివేకమని తెల్లమగుచుండ లేదా ? అని యనేక ప్రకారముల నా భైరవీదేవిని గొనియాడెను.

అప్పుడాదేవి వెండియు నశరీరవాక్కుల నిట్లనియె రాజేంద్రా ! నీ యొద్ద గల యనంగమోహినీ శిరోరత్నమే యరిందమునకు సంజీవనమయ్యెను. ఇయ్యది మృతసంజీవిని యనెడి యనర్ఘరత్నము. రత్నచూడుడను నా గోత్తముని శిరమునఁ బుట్టుకతోనే పుట్టి యనంతరము వాసుకివశమై యనంగమోహినికి శిరోభూషణమైనది. ఈ మణి శ్రేష్టము నీ యొద్ద నుండుటచేతనే నీచేఁ గొనిపోఁబడినఁ మందసములోని శబరబాలకుఁడు గూడబునర్జీవితుండై పైకివచ్చియా పెట్టెం బట్టుకొని భయోద్రేకమునఁ బారిపోయెను. నాఁడు హిమవన్నగమున వ్యాఘ్రము నీచేఁ జావకుండుటకు నిమ్మణియే కారణము. ఇప్పుడు నీకు మరణము గలుగకుండుటకుఁగూడ నా రత్నప్రభావమే మూల మని వేరుగఁ జెప్పఁబనిలేదుగదా ?

ఈ యరిందముఁడు నీకిఁకమీద మిత్రుఁడై సేవకుఁడై సహచరుండై మెలంగగలవాఁడు. శబరబాలకు నన్వేషించుటలో మీఁకు గొంతశ్రమ గలుగఁగలదు. కాని శీఘ్రకాలములోనే సౌఖ్యములఁ బడయఁగలరని మిన్నకుండెను. ఆ పలుకుల నాల కించి వారిరువురును సంతోషాశ్చర్యములఁ బొందిరి. దేవి యానతివడువున వారొకరి కష్ట సుఖములకొకరు సహాయులగుచుఁ బ్రాణమిత్రులై యుండుటకు బాసఁ జేసికొని యా భైరవీదేవికి నమస్కరించి యందుండి శబరబాలకు నన్వేషించుటకు వెడలి పోయిరి.


313 వ మజిలీ

శబరబాలకునికథ

దివోదాసుఁడు మొదట బైరవీదేవి యాలయములో నరిందముఁడు స్నానార్ద మరిగినప్పుడు శబరబాలక శవమున్న మందసము మూత పైకెత్తి విమర్శించినప్పుడే వానియొద్దఁగల మృతసంజీవనీ రత్న ప్రభావము తత్పేటికాంతరమున బ్రవేశించెను. పిమ్మట నతండా పెట్టెంబట్టుకొని కాసారతీరమున కేగుచున్నప్పుడే శబరబాలకునకు చైతన్యము లభించెను. సరోవరతీరమునఁ బెట్టెనుబెట్టి దివోదాసుఁడు స్నానమున కరుగు నప్పటి కాబాలకునకు బూర్తిగా దెలివివచ్చినది. పిమ్మటఁ దైలద్రోణియందుండుట కూపి రాడక వీపుతో దానిమూత పై కెత్తి యీవలంబడెను. వానికంతయు నంధకారబంధుర ముగా దోచెను.