పుట:కాశీమజిలీకథలు-12.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము


పొలియుటకేఁ బ్రయత్నపడఁ బోయిననద్దియు వ్యర్థమయ్యె నిం
దులకు మదీయబాహుబల దోషమెకాక మరేమిమాయయో !

తల్లీ ! నేనిందేమి చేయవలెనో యానతిచ్చి నన్ను ధన్యునిం జేయము. నీ యాదేశమువడవున బ్రవర్తింపగలవాడని పలికి యామె యాజ్ఞకు వేచియుండెను. అప్పుడద్దేవి యశరీరవాక్కుల నిట్లని బదులు చెప్పెను.

వత్సా ! అతి సాహసము నెప్పుడును బూనకుము. మరణము గోరినంతనే వచ్చునదికాదు. ఆపదలు కాపురము సేయవని చెప్పు పెద్దలమాటల నెన్నఁడును విన లేదా ! కష్టసుఖములలో ఏది యెప్పుడు వచ్చినను దేహికి‌ యనుభవింపక తప్పదు. కొలది దినములలోనే నీకు సర్వసౌఖ్యములు లభింపఁగలవు. నికుంభుని నిర్జించునప్పుడు నీకు లభించిన మణిభూషణ మనంగమోహినిది. అది నీ యుత్తరీయమున నుండుట నీవు మరచియుండవచ్చును. దాని నెచ్చటను విడువక భద్రముగాఁ గాపాడుము. నీకే యాపదయును వాటిల్లదని పలికి యూరకుండెను.

ఆ పలుకుల కచ్చెరువడుచు నిజోత్తరీయమునఁ గట్టబడిన యమ్మణిభూషణ మును ఫైకిఁదీసి కన్నుల నద్దుకొని తిరుగఁ బూర్వపురీతిని భద్రపరచెను. ఇంతలో నందు బడియున్న యరిందమునకు చైతన్యము గలిగెను. కొండొక తడవునకు వాఁడు నిదురఁబోయి మేల్కొన్నవానివలె లేచి యెదురనున్న యా రాజేంద్రుని జూచి చకితు డయ్యెను. దివోదాసుండును వాఁడు బునర్జీవితుండగుటకు నివ్వెరంబడుచు నందుల కయ్యమ్మవారి యనుగ్రహమే కారణమని తలంచి యామె మహిమ ననేక విధములఁ నంతరంగమునఁ గొనియాడుచుండెను.

అరిందముని స్వభావమంతయును మారిపోయెను వెనుక‌ నెంత దుష్ట చిత్తుడో యిప్పుడంత మంచిబుద్ధిగలవాఁడయ్యెను. తొనొనర్చిన కుచ్చిత చేష్టితములెల్లఁ దలంచి తనకుదానే యేవగించుకొనసాగెను. దివోదాసుని జూచినతోడనే భయభక్తి విశ్వాసములు వాని మనమున నొక్కసారి పుట్టెను. ఆ రాజమార్తాండునకు నమస్క రించుచు వాడిట్లనియె. ఆర్యా ! మీరెవ్వరో నాకుఁ దెలియదు. ఈ భైరవీదేవి యాలయ మున నేనొక ఘాతుక కార్యమునకు గడంగఁబోవుతరి నెవ్వరో నన్బట్టి దేవీ పాద మూలమునఁ బడవేయుటమాత్ర మెరుంగుదును. పిమ్మట నేమి జరిగినదో నెరుంగను. నేనొనర్చిన తప్పునకు పశ్చాత్తాపమును బొందుచుంటిని. మీరెవ్వరు ? ఇందేమిటికి వచ్చితిరి ? మీ యుదంతము సర్వము నెరింగించి నన్ను గృతార్థుని జేయుఁడని వినయముగాఁ బ్రార్థించుటయు దివోదాసుఁడు తన కథ సంగ్రహముగా వానికిఁజెప్పి వాని నయ్యమ్మవారిమ్రోలఁ జంపఁబూనినది తానేయనికూడ వెల్లడించి మరియు నిట్ల నియె. యక్షపుంగవా ! ఈ యమ్మవారి మహిమ మిగుల స్తోత్రపాత్రముగా నున్నది‌. ప్రాణములఁ బాయనెంచి యనేకసారులు దలఁదరిగికొన్నను నాకు మరణము సంభవింప లేదు. నీకుఁగూడ పెక్కుసారులు ఖడ్గప్రహారములుఁ దగిలినను నాపద గలుగదయ్యె.