పుట:కాశీమజిలీకథలు-12.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

ఆ పెట్టియందు దన్నెవ్వడో బంధించి యచ్చటకుఁ జంపునుద్దేశముతో దెచ్చి నట్లు వాడు తలంచెను అచ్చటనున్న దనకు బ్రాణాపాయము రాగలదని నిశ్చయించి యందొక నిముసమైన నుండవెరచి యా మందసమును నెత్తిపై బెట్టికొని యతి జవమున నొక దారిం బట్టి పారిపోయెను.

ప్రాణభీతిచే వాడట్లు పోయిపోయి యలసట గలుగుటచేత ముందేగజాలక యందొకచో బెట్టెను దింపి దానిపై గూర్చుని యాయపరిచిత ప్రదేశమున తనయసహా యత్వమునకు జింతించుచుండెను. అప్పటికి వెలుగు వచ్చినది. దిక్కులు విస్పష్ట ముగ గన్పట్టుచుండెను. ఆ ప్రదేశమంతయు వానికివింతగ దోచుచుండెను. ఇంతలో నిరువురు పురుషులు వాడున్న చోటికి వచ్చుచున్నట్లు గనంబడెను. వారిం గాంచిన తోడనే శబరునకు మేను కంప మొందసాగెను వారే నిక్కముగ దన్ను జంపదలం చినవారిని భీతి జెందుచుండెను. ఎచ్చటికైన వారికి జిక్కకుండ బారిపోవ నుంకించు చుండెను. కాని వానికది సాధ్యపడలేదు. ఆ పురుషులు పరుగుపరుగున వాని సన్నిధి కేతెంచి చెరియొక ఱెక్కయును గట్టిగా బట్టుకొని నిలబెట్టిరి.

వాని యొద్దంగల మందసమును గాంచి వాడొక చోరుడని సంశయించి వారట్లు జేసిరి. ఆ యమాయక బాలకుండు వారిచే బట్టుబడి భయోద్రేకమున వివశు డయ్యెను. వారడిగిన ప్రశ్న కొక్కదానికిని వాడు బ్రత్యుత్తరం బొసంగకుండుటచే వారి సంశయము వృద్ధియయ్యెను. వానియొడల నంటియున్న తైలము గాంచి వారిరు వురు వాని దొంగయని నిశ్చయించిరి. పెట్టె నెచ్చట మృచ్చులించితివో నిక్కము జెప్పెదరా లేదా యని నిర్బంధింప దొడంగిరి. వారేమన్నను వివశుడై యున్నందున మారుమాటాడలేదు. కొండకవడిగా బాలకుండు వారి చేతులలోనుండి క్రిందకొరి గెను. చేష్టలు దక్కియున్న వాని నందు బరుండబెట్టి యా పురుషులు మందసమును బరీక్షించిరి. అందే వస్తువయును లేక తైలావలిప్తమై యుండుటకు నివ్వెరంబడుచు వారిట్లు వితర్కించుకొనిరి.

ఒకఁడు - సోదరా ! జలంధరా ! ఇదేమి చిత్రము ! ఈ పెట్టెలో నలు మూలల దైలమిట్లు పూయబడియున్న దేమి ?

జలం -- మణిగ్రీవా ? ఈ చోరుని యొడలగూడ నిట్టితైలమే యుండుట దిలకింపలేదా ? వీడెద్దియో ఘాతుక కార్యాచరణపరాయణుండై యచ్చటికి వచ్చి మనచే బట్టుపడెను.

మణి --- వీడతిభీరుడువలె దోచుచున్నది పట్టుబడినంతనే చైతన్యము బాసిన వాడెట్లు దొంగతనము జేయగలడు ?

జలం - ఇట్లుండుట గూడ దొంగవేసమే కావచ్చును. మనల మాయ జేయుట కిట్టి పన్నుగడ వేయుచుండెనేమో ?