పుట:కాశీమజిలీకథలు-12.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అరిందమునికథ

59


    కరముదురాశఁగుచ్చితపు గార్యమొనర్పఁగనున్న యక్ష ము
    ష్కరునివధింతు నేఁగడఁగి శాంకరి ! నాపయినల్గఁబోకుమా.

అని దండప్రణామము లాచరించి యారాజమార్తాండుడు యధాప్రకార మాశక్తి విగ్రహము మాటునకుఁబోయి యందు వేచియుండెను.

ఇంతలో నరిందముండు స్నానముమొదలు గాఁగల ధర్మంబుల నిర్వర్తించు కొని యయ్యమ్మవారి యాలయంబులోని కేతెంచి యందు ధౌతవస్త్రధరుఁడై నియమ యుక్తుఁడై శక్తిస్తోత్రంబులఁ పఠించుచుఁ దానలంకరించిన పట్టులో నమ్మవారి‌ విగ్రహ మున కభిముఖముగాఁ గూర్చుండి లఘువుగా దేవినర్చించి యోమెనుద్దేశించి యిట్లనియె.

తల్లీ ! శాంభవీ ! భవత్ప్రీతికై నేను దలపెట్టిన యీ వ్రతము నేఁటితోఁ బూర్తిఁజేయుచున్నాను. నేను కోరిన గుణవతి నన్నుఁబతిఁగా నంగీకరింపఁజేయుటకు నీవే కర్తవు. ఈ వ్రతసమాప్తమున కవసరమగు నరకళేబరమును సంపాదించుటకు నేను పడిన శ్రమకైనను నాపై నీ కనుగ్రహము కలుగవలెను. ఎన్నఁడును జీవహింస యొనర్పనని వృద్ధసర్ప మెందైననుండునా ? అట్టిదాని నెట్లో పుణ్య వశమునఁ గనుంగొనఁ గలిగీతిని. అయ్యది పరమనిష్టాగరిష్టయై వల్మీకగర్భమందు యోగనిద్రలో నున్నది. దాని నొరులెరుంగుట యెట్లు ! అదియొకరిఁ గరచి చంపుట యెట్లు ? కామరూపంబున నేనొక శబరబాలకుఁడనై నయ్యరణ్యమునఁ బశుల మేపుకొను చుండు వనాటబాలకులతో గలసి వారితో మైత్రి జేసితిని.

ఒకనాఁడొక్క బాలకునిఁ జేరఁదీసి యావల్మీకగర్భమందలి సర్పమును జూపించి యాపుట్టఁద్రవ్వి దానింజంప బ్రోత్సహించితిని. వాఁడును చేతనున్న గండ్ర గొడ్డలితో నా వాల్మీక‌ విచ్చేదం బొనరించి యానాగమును జిదుకఁగొట్టెను. అది చావలేదని నేనెరింగియును దాని తోకఁబట్టితెచ్చి మిత్రులకుఁ జూపింపుమని వానికిఁ బురికొల్పితిని. ఇట్లు చెప్పుట యాబాలకునెట్లయిన నాపాము గరచి చంపవలెనను నుద్దేశ్యముతోనే గాని మరొకటికాదు. అవ్వెంగలీడు నా మాట బాటిసేయుచు దానితోక బట్టి యీవలకీడ్చి యాటలాడసాగెను. నేను తలంచినట్లు తోడనే యాపఱేడు కినుక బూని నిజాభీలవిషజ్వాలల వానిని జంపి యవులంబోయెను.

అవ్వార్తవిని యందున్న శబరులెల్లవచ్చి చూచి యాక్రోశించుచుఁ దమ యేలిక కా యుదంత మెరింగింపబోయి యందుగొందఱ గాపుంచిరి. నేనును వారిలో నొకడనైయుండి యొరులెరుంగకుండ నా బాలకుని శరీరమును గగనమార్గమున నపహరించుకొని యిల్లుజేరి యిప్పటివరకు దైలద్రోణియందుబెట్టి కాపాడితిని. నేడద్దానిని నీకర్పించి నిన్ను మెప్పించి నా యభీష్టముము దీర్చికొందును.


చ. అనుపమమైన నీదు కరుణామృత శీకరసత్ప్రసార మె
    వ్వనికి లభింపగాగలదొ వాడెకదా కడుధన్యుడెన్నగా