పుట:కాశీమజిలీకథలు-12.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

వింటివా ? ఇప్పవిత్రప్రదేశంబున వారికెంత యభిమానమో తెలిసికొంటివా ? అని యనుటయు నగ్గోపాలుండు విస్మయమందుచు నయ్యగారూ ! దేవతలాపురంబు నెందు లకు విడువవలసివచ్చినది ? సర్వసమర్థులగువారు వెండియునందుఁ బ్రవేశించుట కేమి యాటంకము గలిగెను ? వారు నిక్కమ యలిగిరేని ముల్లోకములు భస్మములగునే ? అట్టివారు సామాన్యులవలె నేమిటి కంత తల్లడిల్లిరి ? ఇది నా కెంతేని వింతఁగొలుపు చున్నది. ఇందెద్దియో విశేష ముండకపోదు. నాకా వృత్తాంతమంతయుఁ దెల్లముగా జెప్పుడని ప్రార్థించిన నమ్మణిసిద్దుండిట్లని చెప్పందొడంగెను.

రిపుంజయునికథ

తొల్లి పద్మకల్పంబునందు స్వాయంభువు మనువుకాలంబున ధరిత్రియం దరువదేఁడు లనావృష్టి సంభవించిన కారణంబున సకల జంతులోకంబు నాకులంబు నంది ప్రజాచయంబగుచున్న కతంబున యజ్ఞయాగాదికంబు లుత్సాదనము నొందెను. అధర్వక్రియలు జెడుటవలన క్రతుభుజులకు హవిర్భాగంబులు కరవయ్యెను. దానం జేసి మానవులకు వోలె బుభుక్షాక్షోభంబు సుపర్వలోకంబునకుఁ గూడ సంభవించెను. ఇట్లు మనుజ దివిజ లోకంబులు వ్యాకులతం బొందుచుండుట కంభోజాసనుండు చింతా క్రాంతుండై యీ యవగ్రహం బుడిపి సకల క్షోణీచక్రంబు రక్షింప దక్షుండగువాఁ డెవ్వఁడో యని యరయుచుండెను.

త్రిలోక సంచారియగు నారదుండొకనాఁడు పితామహుని సన్నిధి కేతెం చుటయు వారిరువురకు నిట్లు సంవాదము జరిగెను.

బ్రహ్మ - వత్సా ! నారద ! ఈ నడుమ నెన్నఁడేని భూలోకమున కరిగితివా ? అందలి విశేషంబు లేమి ? అమరలోక వర్తమానంబు లెట్లున్నవి ?

నార -- వనజసంభవా ! అరువదియేండ్లనుండి భూలోకంబు క్షామదేవత చేతఁ బీడింపఁబడుచున్న కారణంబున నందు జన్మంబు లన్నమాటయే యెచ్చటను వినిపింపకున్నది. దానంజేసి స్వర్గంబున రంభాసంభోగ వాంఛా సమాగతయాయజూక ప్రకర వికట ప్రకటానేక ముష్టియుద్ద విశేషంబులు శూన్యంబులైన కతంబున నాకు కలహంపుటోగిరము గరవయ్యెను. అందువలన నేనెట్లు చిక్కి బక్కవారి యుంటినో గనుంగొనుము.


అ. వె. వ్రేలెడేసిలోతు వెళ్ళేఁ గన్నులు జూడు
          ప్రేవులన్ని లెక్కఁ బెట్టవచ్చు
          గడుపువెన్ను నంటె గాళ్ళీడ్గిలంబడె
          సమిధవలెను మేను సన్నమయ్యె.