పుట:కాశీమజిలీకథలు-12.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

శుభమస్తు అవిఘ్నమస్తు

కాశీమజిలీకథలు

పండ్రెండవభాగము

301 వ మజిలీ

క. శ్రీ విశ్వేశా ! రౌప్యన
   గావాసా ! వోమ్యకేశ ! హైమవతీశా !
   భావజనశా ! యీశా !
   కైవల్యపురీప్రసిద్ద కాశీవాసా !

దేవా! అవధరింపు మట్లు మణిసిద్ధ సిద్ధయోగీంద్ర చంద్రుండు శిష్యునితో నేకోత్తరత్రిశతతమ నివాస ప్రదేశంబుజేరి యందున్న నిర్మలజలాకరంబునఁ గృత స్నాతుండ్రై విధ్యుక్తంబులఁ గ్రమంబున నిర్వర్తించి వంటఁ జేసికొని భుజించి తద్భుక్త శేషమంతేవాసికిం బెట్టి యుచితస్థలంబున సుఖోపవిష్టుఁడై యున్న సమయంబున నగ్గోపాలుండు వాని‌ సన్నిధిం జేరి యడుగులొత్తుచు నిట్లనియె.

గురుప్రవరా ! ఈ ప్రాంతములయందుఁ జూడఁదగిన వింత లేమియును గనఁబడవు. పధిశ్రమంబును నధికంబుగాఁ గలిగియుండుటచే దూర మరుగలేకపోతమి. నేఁడు కాశీప్రభావద్యోతకంబగు నితిహాసం బెద్దియేనిఁ జెప్పి నన్ను ధన్యునిం జేయుఁడని ప్రార్ధించుటయు నయ్యతి పుంగవుండు మందస్మిత సుందరముఖారవిందుఁ డగుచు నిట్లనియె.

వత్సా ! కాశీప్రభావం బింతింతని వర్ణింప నిలింప గురునకైన శక్యము గాదు. కైలాస సత్యలోక ప్రముఖ నిఖిలపుణ్య లోకంబులకన్న మిన్న యనిగాదే సర్వనుపర్వ సందోహం బీవారణాసి ననవరత మాశ్రయించియుండు. కైలాసము కన్న నియ్యది కడుపవిత్రమనిసుమీ యా యిందుమౌళి నిజపరివారసమేతుండై యిందు నివసించి విశ్వనాధుండనఁ బ్రసిద్దికెక్కియుండెను. వెనుక నొకప్పుడు కొంతకాలము కాశీ‌వాసయోగ్యత తప్పిపోవుటచే దేవతానీక మెంత తల్లడపడెనో యెగుంగుదువా ! మరియు తత్పురమును దిరుగ నాక్రమించుకొనుటకు వారెంత ప్రయత్నించిరో