రిపుంజయుని కథ
11
బ్రహ్మ — ఔరా! నారదా? లోకవిశేషంబులం దెలుపుమన్న నీకలహప్రియత్వంబు దేటపరచెద వేమిటికి?
నార — తండ్రీ! విశేషముల కేమున్నది. పుడమిఁ బొడమిన యవగ్రహంబువలనఁ బాడిపంటలు పూర్తిగా నశించెను. మీఁదుమిక్కిలి విషూచి మశూచికాద్యనేకదారుణరోగంబు లుత్పన్నంబులై ప్రజలఁ గోటానుకోటులుగ యమసదనంబునకుఁ బంపుచున్నవి. దానంజేసి యమధర్మరాజునకు గడియయైనఁ దీరికలేక విసిగిపోవుచున్నాఁడు. వానికొలువునఁ గింకరుల సహస్రసంఖ్యాకుల నూతనముగఁ జేర్చికొనవలసివచ్చినదఁట. ఇట్లు కొంతకాల ముపేక్షించినఁ బుడమి నకాలప్రళయము తప్పక సంభవింపఁగలదు.
బ్రహ్మ — జలాధిదేవతలు వరుణుఁడు నింద్రుండును గదా? వా రేలఁ భూమిపై వర్షముల గురిపించి యీ యుపద్రవము నడిగింపకుండిరిఁ వారి ప్రీతికొరకుఁ గూడ పుడమినున్న జన్నిగట్టులు హావిర్భాగముల నొసంగుచుందురుగదా?
నార — కల్పపంచకంబును కామధేనువును సన్నిధింబడసినవారి కితరచింత యేమి యుండును? ఇదియునుంగాక పైనుండువారు క్రిందివారివిషయమై యాలోచించుట యరుదు. భూతనిర్మాత వగుటంజేసి నీకు తత్‌క్షేమ మరచికొనుట సహజ మగును. పెంచిన మొలకను ద్రుంపఁ జూచువాఁ డుండఁడుగదా? మఱియును మర్త్యులకు జరుగుచున్న యన్యాయమును గట్టిగా నింద్రాదుల నడిగినవా రెవ్వరు? మనమందరమును వారిపక్షమే యగుటచే వారికృత్యము దప్పని యెఱింగియును నిర్బంధించి యడుగఁజాలము. మర్త్యులపక్షమున నట్టివాఁ డొక్కఁడున్నయెడల మనమెల్లరము దెల్లవోవలసియుండును.
బ్రహ్మ — కావుననే నిఖిలధరణీచక్రరక్షణైకధురంధురుండగు యొడయం డుండుట యెల్లవిధములను సమంజసమని తోచుచున్నది. అట్టివాఁ డెవ్వఁడైన నున్నఁ బేర్కొనుము. వానికి భూచక్రంబెల్లఁ బట్టము గట్టి ప్రజలక్షేమమునకై నియోగింతము.
నార — లోకములన్నియును వట్టిపోయిన వనుకొంటివా యేమి? మీ కట్టియభిప్రాయ మున్నయెడల మనువంశసంభూతుం డగురిపుంజయు నిందులకుఁ బంపరాదా ? వాఁ డన్నివిధములఁ బుడమి బాలింప సమర్థుఁడు.
బ్రహ్మ — ఔను. చక్కగా జ్ఞప్తికిఁ దెచ్చితివి. ఆ రిపుంజయుం డౌదార్యశౌర్యధైర్యగాంభీర్యాదిసద్గుణగరిష్టుం డగును. వానియౌదల సర్వవసుంధరాభార మిడినఁ తత్ప్రభావబలవిక్రమంబుల లోకంబు స్వస్థతం బొందఁగలదు.
నార — చండశాసనుం డగు వాని కేల్పడి యొసంగినఁ జివురకు మనయందరకుంగూడ బొమ్మ గట్టునేమో యాలోచింపుఁడు.