పుట:కాశీమజిలీకథలు-12.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనంగమోహిని కథ

53

యప్పుడు నీవెందుండి‌ చూచితివి ? ఇచ్చటికేల వచ్చితివి? నీ యుదంతంబింతేని దాపక వైళమ చెప్పము

రక్కసుఁడు - మహాత్మా ! నేను రసాతలవాసుడను. కుంభనికుంభులమను మేమిర్వుర మన్నదమ్ములము. వాసుకి తనూజాతయగు ననంగమోహినింగాంచి మే మిరువురమును మోహించి యెట్లయిన నామెం గలయు నాసతో దిరుగుచుంటిమి. రసాతలమునుండి యామెను మేమే యపహరించి భూలోకమునకుం దెచ్చితిమి. హిమవ త్పర్వతసన్ని కర్షమం దామెను బలాత్కరించుచున్న మా యన్నను మీరు నిర్జించు నప్పుడు నేనొక ప్రాంతభూరుహము మాటున నుండి చూచుచుంటిని. పిమ్మట వ్యాఘ్ర నెపంబున మీరేగుటయు నంతలో నిరువురు యక్షులా మోహనాంగిని బట్టుకొని విమాన మునం బెట్టుకొని పోవుటయు గూడ జూచితిని. ఆ చిగురుబోణిపై గలి యాసంజేసి నేనా విమానము పోయినదారినే యంబరంబున కెగసి బ్రచ్చన్నముగా బోతిని.

ఆ విమానము స్వర్గమందు హేమావతీ గృహారామమందు నిలచినది. అనంగమోహినిం దీసికొని యందున్న వారు తత్సౌధము లోనికి బోయిరి. నేనా యుద్యానమందున్న మంజునికుంజమంజిరుల నడంగియుండి వారి చర్యలన్నియు గని పెట్టుచుంటిని. పిమ్మట గొంతసేపటి కాప్రాసాదంబునందు వాక్కలహము వినంబడు టయు నేనొరు లెరుంగకుండ తత్సౌధోపరిభాగంబున కెగసి యందొక రహస్య ప్రదేశ మున బొంచియుండి వారిమాట లాలకించితిని. అందొకడు మణిగ్రీవుండును రెండవ వాడు జలంధరుండును, వారా యనంగమోహిని కొరకు తగవులాడుకొనుచు తుదకం దుండి యవులం బోయిరి. పిమ్మట నిరువురు చెలికత్తెల సహాయమున ననంగమోహిని విమానశాలవైపు బోవుచుండుట గ్రహించి మించిన తమకంబున నయ్యబలను బట్టుకొని పైకెగసి పారపోతిని.

అట్లతిజవంబున బోవుచుండ నాకు ముందొక దివ్యయానము గనంబడినది. దేవతలెవరైన నందెక్కి నన్ను బట్టుకొను దలంపున వచ్చుచుండిరేమోయను భయం బున వెనుకకు దిరిగి పెద్దదూరమరిగి తిరిగి తిరిగి యిప్పటికి దైవోపహతుండనై పులి యున్న గుహకు జేరినట్లు వచ్చి నీకు జిక్కితిని. ఆ బాలామణికొరకు నేనెంత పరి తపించినను నాయందా నాతి కిసుమంతైన ననురాగము లేదు. అట్టి యిష్టములేని భామి నికై బలవంతబడుట మిక్కిలి యవివేకమని నాకిప్పటికి దోచినది ఇక బుద్ధివచ్చినది నేనెన్నడు నిట్టిపనికి బూనను. తప్పు సైరించి నన్ను క్షమింప బ్రార్థించుచున్నాను. అని వినయముదోప బలుకుచున్న యానికుంభుని వృత్తాంతమంతయును వినియా భూజాని యానంద విస్మయ పరితాపంబులు మొగంబున గనుపింప నల్లన వాని కిట్లనియె.

ఓరీ! నీవిప్పుడు మ్రుచ్చులించుకొని వచ్చిన మచ్చెకంటి యల్లనాడు హిమవన్నగర పార్శ్వంబున నాతో గొంత ముచ్చటించిన మించుబోణియేనా ? యని