పుట:కాశీమజిలీకథలు-12.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

చిత్రలేఖా ! నీ మాటలేమియును నా హృదయమునకు బ్రియంబులు గాజా లవు. అతడు తప్పక స్వయంప్రభాదేవి యనుగ్రహముననే యిందు విచ్చే సెను. నిర్దుష్టమగు మన్మనంబే యిందులకు బ్రమాణము. నా యభిప్రాయమునకు బ్రతికూల ముగా నీ వేమియు నింక జెప్పవలదు. నేను చెప్పినట్లు నీవు వినవేని నా ప్రాణములు మేననిల్వవని నిక్కముగ నమ్ముము. సత్వరమ నా మనోహరుని సమీపమున కేగి యెట్లయిన వానినిందు దోడ్కొని రమ్ము. ఈపాటి యుపకారము నాకు జేయుము. నీ మేలెన్నడును మరువనని బ్రతిమాలుచున్న గుణవతి కెదురాడనోడి యవ్వలనున్న యా నూత్నపురుషుని వృత్తాంత మరసి వచ్చెదంగాక యని చిత్రలేఖ యప్పుడే క్రిందకు బోయినది.

అప్పటికి దివోదాసుండా వీధిదాటి యదృశ్యుండయ్యెను. చిత్రలేఖ వాని నన్వేషించుచు నా చుట్టుపట్టులం దిరుగాడుచుండెను. ఇంతలో నా ప్రాంతమందాడుదాన యాక్రందనధ్వని వినంబడుటయు నా చిత్రలేఖ విభ్రాంతయై యిటునటు బరికింపు చుండ నొకవైపు నుండి వెఱవకుము, వెఱవకుమని పెద్దగా గేకలు పెట్టుచు పురుషు డొకడు పైకెగయుటయు గనిపెట్టెను. వానింజూచి గుణవతిచే వరింపబడిన వాఁడే యని నిశ్చయించి యాత్రముతో వానిపోక బరీక్షించుచుండెను.

ఆ పురుషుండట్లు పైకెగసిపోయి యొక యబల నెత్తికొని పోవుచున్న రక్కసి మ్రొక్కలీనిం గవిసి నిలు, నిలుమని యదలించెను. వాడీ పురుషుని జూచి చకితుడై ముందుబోవుట మాని తిన్నగా గుణవతి యున్న సౌధముమీద వ్రాలెను. దివోదాసుండును వాని వెంటాడి యా సౌధోపరిభాగముజేరి యా రక్కసుని జుట్టు పట్టుకొని నిలువబెట్టెను. వాని సందిటనున్న పూవుబోణి యీవలబడి భయోద్రేకమున నందొక గదిలోనికి బారిపోయెను. ఆ యద్భుత దృశ్యమున కందున్న యోషిజనంబెల్ల భయవివశలై యంతర్గృంహంబుల కేగిరి.

ఆ రక్కసుండట్లు దివోదాసునిచే జిక్కి చేయునది లేక చేతులు జోడించి నమస్కరించుచు రక్షింపుము, రక్షింపుమని ప్రార్దించెను.

దివో - [మహాక్రోధముతో] తుచ్చుడా ! నీ వెవ్వడవు? ఆ నారీశిరోమణి నేమిటి కట్లపహరించుకొని పోవుచుంటివి? ఆమె యెవ్వతె? నిజము చెప్పుము. లేకున్న నుత్కుఠారతీవ్రరాభిఘాతమున నీ కంఠం బూడి పడగలదని కత్తిపైకెత్తెను.

రక్క - పురుషపుంగవా ! నీ బలపరాక్రమముల నేనెరంగుదును. హిమ వత్పర్వత ప్రాంతమును నాడు నా యన్నయగు కుంభుని నీవు నిర్జించుట నేను కన్ను లారా జూచితిని. నీవెత్తిన కత్తిని క్రిందకు దింపువరకు భయోద్రేకమున నా నోటమాట వెల్వడకున్నది. ఆపన్ను డనై ప్రార్థించుచుంటిని. ఇంచుక శాంతి వహింపుము. నాపై ననుగ్రహము జూపుము. శరణాగతత్రాణుండవుగమ్ము అని డగ్గుత్తికతో బ్రార్దించెను.

దివోదాసుఁడు - ఓరీ ! నా చేత నాడు నిర్జింపబడినవాడు నీకన్నయగునా?