పుట:కాశీమజిలీకథలు-12.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనంగమోహిని కథ

51

దచ్చటచ్చట స్త్రీలు మాత్రము గనిపించుచుండిరి. అట్టి ససుయమున మన దివో దాసుండు పాదచారియై రాజమార్గమునఁ బోవుచుఁ గ్రమమునఁ జిత్రకేతుని ప్రాసాద సమీపమునకు వచ్చి యా ప్రాంతములయందు కింకర్తవ్యతామూడుండై యిటునటు దిరుగుచుండెను.

తత్ప్రాసాదోపరిభాగమున నుండి దూరమందు జరుగుచున్న యుద్ధమును గమనించుచున్న గుణవతి దృ‌ష్టులు దటాలున వీధియందున్న దివోదాసునిపైఁ బ్రస రించెను. వాని రూపలావణ్యజాలముల నా మద గజయాన నేత్రరాజీవములు జిక్కు పడినవి. అందులకు సందడించుచు నయ్యిందువదన చిత్రలేఖను చేరఁబిలిచి మోహా వేశమున నిట్లనియె.

నెచ్చలీ ! ఈ యుద్ధసమయమున నొంటిగా వీధి జరించుచున్న యా పురుషశ్రేష్టుం దిలకించితినా ? ఈ భాగ్యశాలి విమర్శింప మానవుఁడువలెఁ దోచు చున్నది. భూలోకయునుండి యిచ్చట కెట్లువచ్చునో గదా? ఆహా! వీని యంగసౌంద ర్యము త్రిభువనా సేచనకముగ నున్నది.


శా. ఔరా! మైజిగి ! హైసరే ! నడలయొయ్యారం ! బొహో మోము సిం
    గారం ! బద్దిర ! తళ్కులీను నిడువాల్గన్దోయి యందము! మ
    జ్జారే ! నెన్నుదు రొప్పిదంబు ! భళిరే ! చక్కదనంబెల్ల నీ
    తీరౌరూపముదాల్చెఁ గావలయుఁ బ్రీతిన్‌ జూడుమా నెచ్చెలీ.

శా. ఏమే ! చూచితివే నిదానముగ రాకేందుస్పురద్వక్త్రునిన్
    నా మాటల్‌ నిజమంచుఁదోచెనుగదా ? న్యాయంబుగా వీని నా
    కామున్‌ గీమునీతోడఁ బోల్పఁదగునా కళ్యాణరూపంబునన్‌
    నా మీఁదన్‌ దయఁజూపి తెల్పఁగదె ? యన్నట్లెల్లఁ దెల్లంబుగా.

ప్రియసఖీ ! స్వయంప్రభాదేవియే వీని నిప్పట్టున నా కొరకై తీసికొని వచ్చెనని తోచుచున్నది. ఈతఁడే నాపతి. త్రికరణంబుల నీతనినే కాంతునిఁగ వరిం చితిని. నీవువేగ మాయనఘుని సన్నిధికేగి వాని నా యంతఃపురంబునకుఁ దోడ్కొని రమ్ము. పొమ్ము అని తొందరబెట్టుఁటయు నా చిత్రలేఖ విస్మయం బభినయించుచు యిట్లనియె.

ప్రాణసఖీ ! వాని కలగోత్రనామశీలము లెరుంగక చూచినంత మాత్రము ననే పతిగావరించు నించుఁబోడు లెందైనఁగలరా? నీవింత యాత్రముంబొంద మేలగునా? నిన్ను వంచింప నిట్లే రాత్రించరుఁడైన మాయవేషమున బూని వచ్చియుండిన నేమి జేయుదువు ? యౌవన ద్రుదుర్భావజనితమహామోహాతి రేకమున నా యపరిచితుని నంతఃపురమునకు దోడి తెమ్మనుట ప్రమాదముగాదా ? అని మందలించు చెలి క‌త్తియ కమ్మదవతి యిట్లనియె.