పుట:కాశీమజిలీకథలు-12.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనంగమోహిని కథ

49

వచ్చెను. అతఁడే నా పతియని నిరూపించుకొని నా యభిప్రాయ మమ్మహాపురుషున కెఱింగించితిని. ఇంతలో వ్యాఘ్రనెపంబున నతఁడు దొలఁగిచన నేనొంటిగానందుం టిని. అయ్యద నెరిఁగి యీతుచ్చులిర్వురునువచ్చి నన్నుబట్టుకొని బలవంతముగా విమానమెక్కించి నీతోగూఁడ నిక్కడకుఁ దీసికొనివచ్చిరి. మీద యుదంతబంతయు నీవెరింగినదే. అని తనకథ నామూలచూడముగా వక్కాణించి యనంగమోహిని వేడి నిట్టూర్పుల నిగుడించుచు వెండియు నిట్లనియె.

తల్లీ ! నా యుల్లమున హత్తియున్న యా పురుషప్రవరుండెవ్వరో నేనెరుం గను. ఏలోకమువాఁడో నాకు‌ దెలియదు. నన్నా యరణ్యంబునఁ గానక నాకై యెంత విలపించుచున్నాడో గ్రహింపఁజాలను. అతనినే నేను త్రికరణములచేతనుఁ బతిగా వరించితిని. వానినే నాకీశ్వరుండొడయనిగా సృజించెను. వానిం గాక నింకొకనిఁ గంతువసంతజయంతాదుల రూపమున నిర్జించినవానినైన నేనొల్లను. ఇదియే నా నిశ్చ యము. ఆ పురుషోత్తముని నేనెట్లుచేరగలనో నీవ యాలోచించి నన్గాపాడుము. ఇదియే నీవు నాకు జేయదగిన మహోపకారంబని వేడుకొనుటయు హేమావతి యామెకిట్లనియె.

అబలారత్నమా ! నీ యుదంతంబు వినినప్పటినుండియు నాకు నీ యందు జాలిగలుగుచున్నది. నీ తండ్రి జగద్విశ్రాంత యశోవిరాజితుండు. అట్టివానికి బట్టివై పుట్టినను నీకిట్టి యిక్కట్టులు తప్పవయ్యెను. ప్రారబ్ధబెవ్వానికైన యనుభవింపక తప్పదుగదా ! మరియును నీవు వరించిన పురుషుడెవ్వడో యెరుంగక వానిసన్నిధికి నిన్జేర్ప గలుగుటెట్లు ? ఇప్పుడు నిన్ను నీతండ్రి సన్నిధికిం బంపెద నంగీకరింతువా యని యడుగుటయు ననంగమోహిని యందు జేరినపిమ్మటఁ జూచుకొనవచ్చునని యెంచి యందుల కంగీకరించుచు నిట్లనియె.

అమ్మా ! భూలోకమును దాటి నాగలోకమేగుటకు వీలులేదుగదా ? దివో దాసుని శాసనమతిక్రమింపవచ్చునా ? యని యడిగిన నయ్యచ్చర మందస్మితయగుచు తరుణీమణీ ! రసాతలమునుండి దివిజలోకమున కెట్లువచ్చితివో యట్లే యిందుండి యందుబోరాదా ఆపదలయందు శాసనము లాగగలవా ? భయములేదని‌ పలికి నక్క లికి యందులకు సమ్మతించినది. అప్పుడే హేమావతి తన చెలికత్తెయ లిరువుర కనంగమోహిని నప్పగించి యామెను దివ్యయానమున రసాతలమునకు గొనిపోయి వాసుకి కప్పగించిరండని నియోగించినది.

అనంగమోహిని ముప్పిరిగొను సంతసముతో హేమావతి యనుజ్ఞఁగైకొని యా చెలిమికత్తియలతో విమానశాలవైపు నడచుచుండెను. అప్పడెచ్చటనుండియో యొక భీకరాకారముగిల వ్యక్తి యువ్వెత్తుగవచ్చి యనంగమోహినిని సందిటఁబట్టుకొని రివ్వున బై కెగిరిపోయెను. హేమావతి చెలికత్తెలమ్మో ? రక్కసుఁడు రక్కసుఁడు,