పుట:కాశీమజిలీకథలు-12.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

పండు దినినది మొదలు నాకు క్షుత్ఫిపాశలు నశించి మేనికి నూతనోత్సాహ మంకురించినది ఆ ప్రదేశమును మూడుదినములవరకు విడువక యందే నివసించి నిద్రబోయినప్పుడెప్పుడైన నట్టి వింతకల వచ్చునేమోయను నాసతోఁ బ్రొద్దులు పుచ్చి తిని. కాని నాకట్టికల తిరుగనెన్నడును రాలేదు. నాలుగవదినంబున నా‌ స్థలమువిడచి ముందునకుఁ గొంత దూరమఱిగితిని. ఆనాఁడు సూర్యాస్తమయసమయంబున నొక నరవననుసరించి పోవుచుంతఁ గొండపైనుండి యెద్దియో దొర్లివచ్చుచున్నట్లు కనంబడి నది నేనించుక విమర్శించి చూచుచుండ నొక రాకాసి శవము క్రిందఁబడినది

ఆ శరీరము పతనవేగంబునఁ దుత్తునియలైనది. దానిం దిలకించి దయఁ దలంచి మచ్చిరోరత్న ప్రభావం బమ్మవారివలన వినియున్న కతంబున నప్పుడే యా రత్నమును దలనుండితీసి వాని మేనంతయు దగిలించి నాసాపుటంబుసన్నిధి నించుక సేపుంచితిని. ఇంతలో నక్క ళేబరంబునఁ జైతన్యము గలి‌గినట్లు తోచినది. విస్మయ ముతో నేనట్లె చూచుచుండ నారక్కసుండు స్వస్థతగాంచి కన్నులుదెరచి యెదుర నున్న నన్ను జూచి దరహాసితముఖుండై దిగ్గున లేచెను. వాఁడు పునర్జీవితుండగుటకు నేను సంతసించుచు నమ్మవారిమాటలు కానందించుచు మదీయశిరోరత్న ప్రభావమున కుబ్బుచు నారాత్రించరుని వృత్తాంత మెరుంగఁగోరి వానినడిగిన నాతో వాఁడిట్లనియె.

తరుణీశరోమణి ! నేను నికుంభుఁడనువాఁడను. కుంభుని సోదరుండను. మేమిరువురము రసాతలనివాసులమే. నీరూపలాపణ్యాదులజూచి వలచిన మేమిరువురము నిన్నపహరించుకొనివచ్చి ఇందుఁజేరితిమి. నీనిమిత్తమే మాకిరువురకు నీప్రాంతమందు పెద్దయుద్ధము జరిగినది చివుర నేను నిర్జింపఁబడి పరాయితుఁడనై తిని. నిన్నుబొ౦దునాస యంతరించుటచే విరక్తుండనై సోదరునివలనబడిన పరాభవంబు హృదయంబెరియుచుండ జీవనముపై నాసవిడిచి‌ యీ కొండనెక్కి భృగుపాతంబునఁ జావఁదలంచి క్రిందకురికి తిని. అచ్చటి దారుణ శిలాభిఘాతమున నిముసములో స్మృతితప్పినది. తరువాతనే మైనదో నాకు తెలియదు. తెలివివచ్చి చూచుసరికి భవధీయ దివ్యరూపంబు నా కన్నుల యెదుట సాక్షాత్కరించినది. భృగుపాతంబునఁబడిన శ్రమంబంతయును నిన్నుజూచుట తోడనే పోయెను. నాకిప్పుడు నూతనశక్తి గలిగినది. దైవమే నన్ను నీ సన్నిధికిం దెచ్చిపడవేసెను. భగ్నమనోరధుండనగు నాకు నిన్ను జూచునప్పటినుండియు హృదయక్షేత్రమున నూత్న యాశాంకురములు ప్రభవించుచున్నవి అని యేమేమో మదనోన్మాందమునఁ బ్రేలుచున్నవానిఁ దిరస్కరించి యావలంబొమ్మని నేననుచుండఁ గుంభుఁడక్కడి కెక్కడనుండియో వచ్చెను.

వానింజూచి నికుంభుఁడు కాలికొలఁది పారిపోయెను. అందు కుంభుఁడు నన్ను బలాత్కరింపఁబోవ నొకదివ్యప్రభావ సంపన్నుఁడగు పురుషశ్రేష్టుం డక్కడకు వచ్చి కుంభుని బరిమార్చి నన్నుఁగాపాడెను. ఆ నూత్నపురుషుని రూపరేఖవిలాసాదుల వీక్షించిన నిర్దుష్టమగు మన్మనంబు సంచలించెను. అమ్మవారి మాటలు దలంపునకు