పుట:కాశీమజిలీకథలు-12.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

గుణ -- ఎక్కడి మనుజలోకము ఎక్కడి యక్షుభువనము. ఎన్నడో యూర్వశీ ప్రభృతుల కట్టి యవకాశము గలిగినదని యందరకు నట్టి సంఘటనము గలుగునా ? నా కదేమి దైవయోగమో గాని యమ్మవారి మాటలు వినినదిగోలె నిన్ని దివిజలోకములుండఁగా మర్త్యలోకమునకే బుద్ధి మరలవలయునా ?

చిత్ర - నిక్కముగ నట్లుండుటకు దైవబలమే కారణము. అమ్మవారి మాటల కన్యధాత్వ మెట్లు సంభవింపఁగలదు. నీ యదృష్టము మంచిది అనతికాలము ననే ధారుణీరాజైక్య ధురంధురుండగు వానికి పట్టమహిషివై యనన్యసామాన్యభోగ భాగ్యంబుల నలరారగలవు ?

గుణ --- అట్టి మహాభాగ్యం బొదివినప్పుడు గదా యనుకొనవలయును. నా తండ్రి చిత్రకేతుండు నన్నొక స్వజాతి పురుషున కంటగట్ట వలయునని పట్టుబట్టి యున్నవాఁడు గదా? నా కోరిక యెట్లీడేరఁగలదో తెలియకున్నది.

చిత్ర -- నీ వేమనుకొన్నను‌ సరేకాని నీ తండ్రి వట్టిమూర్ఖుఁడు. కాకిముక్కు నకు దొండపండును గట్టినట్లుగా సర్వకళాప్రపూర్ణువగు నిన్నొక విద్యావైభవ శూన్యుం డగు యక్షకుమారునకు కట్టిపెట్ట నిట్టట్టనరాని ప్రయత్నముల జేయుచున్నాడు. వాని మాటల విని నీవెన్నడును మోసపోకుము. పిదప చింతించిన లాభముండదు.

గుణ - అయ్యో ! నా తండ్రి మాటల విని మా యమ్మయు నన్నిందుల కొడంబడుమని నిర్భంధించుచున్నది. ఈ గండమెట్లు దాటగలనో గదా ?

చిత్ర - నీ తల్లిదండ్రులు సెప్పుచున్న యక్షకుల కలంకమగు నీతండీ మధ్య నొక చిత్రము జేసెనఁ‌ట వింటివా?

గుణ - నాకేమియు దెలియదు చెప్పుము.

చిత్ర - త్రిలోక దుర్ల భంబగు నీదు సౌందర్య వాగునా బద్ధహృదయ రాజీవుండై నీవే తనకు భార్యగావలయునని కోరుచు భైరవీ దేవింగూర్చి యామూర్ఖుం డనేక క్షుద్రోపాసనల నొనర్చుచున్నాఁడట. ఆ వ్రత సమాప్తి ఱేపు జరుగఁగలదట.

గుణ -- (నవ్వుచు) నా మనంబొల్లనప్పుడు మంత్ర తంత్రంబులువ రించునా యేమి ? దేవతోపాసనలు విధివియోగమును దప్పింపగలవా ?

చిత్ర -- దేవతోపాసనలు దైవవిధి నెన్నఁటికిని దప్పింపజాలవు ఇందు వలన వానికి లాభము కలుగుమాట ముందెటులున్నను నేఁడు వాని యకార్యకర ణంబులు జగంబునకుఁ దెల్లమయ్యెను.

గుణ - అదెట్లు.

చిత్ర --- వినుము. తద్వ్రత సమాప్తమునకు నెన్నఁడు నొరులఁగఱచి యెఱుంగని వృద్దసర్పవిషంబునఁ దనువు బాసిన మనుజబాలక ప్రేతంబును దెచ్చి తచ్చిరోజముల వింజామరలుగ కపాలపుంజిప్పలు దీపపుం బ్రమిదలుగ మేనిక్రొవ్వు దైలంబుగా నాంత్రంబులు వర్తులుగ నేర్పరచి యా భైరవీదేవి నారాధించి యా శవాక్షి