పుట:కాశీమజిలీకథలు-12.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుణవతి కథ

39

గోళంబులతో నీరాజనమెత్తి తదీయ హృదయపిండంబు నై వేద్యము పెట్టి యా వ్రత దీక్ష పూర్తిసేయవలయునట.

గుణ - అబ్బా ! నీవు చెప్పుచున్న పూజావిధానము వినిన హృదయగ్రంధి విడిపోవుచున్నదిగదా ? ఎట్టి దారుణము. ఎట్టి యనుచిత కార్యము ! ఎట్టి రాక్షస కృత్యము !

చిత్ర -- అట్టి నరబాలక కుణపంబునకై వాఁడెన్నియో పాట్లుపడి యెట్ట కేల కీనడుమ నెట్టులో యొకదానిందెచ్చి వ్రతసమాప్త దివసంబు వచ్చువఱకు నొక తైల ద్రోణియందుంచి కాపాడుచుండెనఁట. ఈ రహస్యము వాని యన్న భార్య నాతో నేదియో ప్రస్తావనమీద నిన్ననే చెప్పినది.

గుణ - ఛీ! వానిచర్యలిఁక నాయొద్దఁ జెప్పకుము. వానిఁ దలంచినవారికిఁ గూడ పాపము లంటఁగలవు వాఁడిట్టి వాఁడు గనుకనే నాజననీ జనకులెంత జెప్పినను వానిం జేపట్టుటకు నా మనంబున నేవగింపు గలిగినది నా విముఖత్వ మెరింగి యా తుచ్చుఁడిట్టి యకార్యంబులకుం గడంగెఁ గావలయును ప్రాణములైన విసర్జింతును గాని యా నీచునీఁ గలనైన నొల్లను.

అట్లు వారు సంభాషించుకొనుటవిని దివోదాస ధారుణీంద్రుండు నివ్వెఱం బడుచు నౌరా ! ఆ యక్షుఁడే గావలయు నాఁడరణ్యంబున సర్పదష్టుండై మృతినందిన శబర బాలకుని ప్రేతము నపహరించినవాఁడు ఇందలి నిక్కువంబెరింగి యాకళేబరము నెట్లయినను గ్రహించి యందు ప్రాణప్రతిష్ట జేయించవలెనని నా మనంబు తత్తరపడు చున్నది. మరియు నీ యక్షకన్యకా లభామ యంగసౌష్టవంబును సుగుణసంపదయును గాంచినప్పటినుండియు మన్మనంబు పంచశర శరావిద్దమగుచుండెను. ఈ బాలికామణికి భూభర్తయే ప్రాణేశ్వరుండగునని యమ్మవారు చేప్పినట్లు వింటినిగదా ? ఈమెం జేపట్టుట కొఱకే పరమేశ్వరుండు నన్నిందు జేర్చియుండవచ్చును. ఈ మోహనాంగి కూడ మనుజుని భర్తగాఁ బడయుట కువ్విళ్ళూరుచున్నది. ఆఃఆ ! ఈశ్వర సంకల్ప మతి విచిత్రమైనదిగదా !


క. ఏది దుష్కర మరు సుకరం
   బెది దుర్లభ మదియె సులభ మెద్ది దురాపం
   బదె సంప్రాప్యము దేహికిఁ
   గుదురుగ నా యీశ్వరాజ్ఞఁ గూడిన యెడలన్‌.

గీ. తలవని తలంపుగా నెందుఁ గలుగుచుండు
   శుభము లశుభంబు లనునవి చోద్యముగను
   వాని కరయంగఁ గర్త యెవ్వాఁడు లేఁడు
   సర్వ మీశ్వరాయత్తమై జరుగుచుండు.

అని యా రాజేంద్రుండిట్లు వితర్కించుకొనుచున్న సమయంబున నా యక్ష