పుట:కాశీమజిలీకథలు-12.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుణవతి కథ

37

బలుచందముల నేత్రా నందముగ గ్రందుకొని కెందలిరుపందిళుల డెందమలరంగ నతఁడందు విహరించెన్‌.


సీ. అచ్చంపు నెలఱాల నమరి పచ్చలమెటఁ
              గొమరు మీరెడు గేళకుళులఁ గాంచి
    మగమానికపుఁ గాంతుల గణితంబుగ దిక్కు
              లకుఁ జిమ్ము దివ్యవేదికలఁ జూచి
    కుప్పకుప్పలుగాఁగ గప్పురంబును విప్పు
              తులలేని యనఁటి బోదుల నెరంగి
    పూల మొక్కలకెల్ల జాలుగా నీర్జల్లు
             జలయంత్ర సువిశేషములగ్రహించి.

గీ. ద్రాక్షపందిళ్ళ సౌరు బెద్దగ నుతించి
    పచ్చికబయళ్ళ సౌఖ్యంబుఁ బ్రస్తుతించి
    పోకమ్రాకుల శృంగారమును దలంచి
    మించి‌ యుద్యానమున విహరించె నతఁడు.

ఇట్లయ్యుపవన విశేషంబులం దిలకించుచుఁ బోయిపోయి ముందర గొంద రలినీలవేణుల విన్నాణంపు బలుకుల రొద విని యా ప్రాంతమందలి యొక పూ పొదరింటఁ బొంచియుండ వారి సంభాషణమిట్లు వానికి వినంబడెను.

గుణవతి -సఖీ ! చిత్రలేఖా ! అనుకూల వాల్లభ్యంబుగోరి భజింపుచున్న నాయందు స్వయంప్రభాదేవి కింకను ననుగ్రహంబు రాలేదేమి ! ఈ దేవి భక్త కల్పకంబందురు గదా ?

చిత్ర -- నెచ్చలీ ! ఏల నీకీ తొందరపాటు. స్వప్నగతయై నీకా లోకేశ్వరి చెప్పిన మాటలు మరచితివా యేమి ? అనురూపవరునిం బొందుటకు నీ కమ్మవారు బెట్టిన మితి నేఁటితోనే కదా తీరుచున్నది. ఎప్పటికెట్లు సంభవింపఁ గలదో యెవ్వరు చెప్పగలరు ?

గుణ - అమ్మవారు చెప్పిన మాట యనిన జ్ఞప్తికి వచ్చుచున్నది. నాకొక దివ్యప్రభావ సంపన్నుఁడగు పుడమి యొడయుండు మగం డగునని యా దేవి యాన తిచ్చినదేమి ? ఇది నిక్కువమగునా ? రుగ్జరామరణభయ వశంవదులగు మనుజులకు మనకును సంబంధమెట్లు సరిపోవును ?

చిత్ర -- బాలామణీ ! మనుజులలో రూపలావణ్య బలప్రభావై శ్వర్యంబుల దివిజులఁ దలఁదన్ను వారెందరులేరు ! పురూరవ చక్రవర్తి చరిత్రయే యిందులకు నిదర్శనము. అచ్చరలలో నందరకన్న చక్క.నిదని యెన్నికఁగన్న యూర్వశి వాని కిల్లాలై యుండలేదా ?