పుట:కాశీమజిలీకథలు-12.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము


307 వ మజిలీ

కుంభనికుంభులకథ

దానవేశ్వరుని యనుమతంబునఁ గుంభదానవుం డిట్లనియె. దానవకుల సౌర్వభౌమా ! రత్నచూడుండరిగిన వెనుక దివోదాస మహారాజు చేరువనున్న కాసార తీరంబునకుఁ బోయెను అతడు నాగలోకమువారు భూమిపై నుండరాదని శాసించిన పుడమియొడయుండని యెరెంగిన కతంబున నాయొడల భీతి జనించినది. నన్ను జూచి యతండు శిక్షించునేమో? యను భయంబున మరియొక మారు మూలదారిని పారిపోతిని.

నేనట్లొకమార్గంబున భయోద్రేకంబునఁ బోవుచుండ ముందొకచో నా కనంగమోహానీ నికుంభులు దృగ్గోచరమైరి. నికుంభుఁడామె పాదంబులంబడి బ్రతిమాలు చుండ నావేదండయాన ఛీ! మూర్ఖుడా! ఆవలఁబొమ్మని యదలించుచున్నది. ఆ దృశ్యము గోచరమైనతోడనే నాకెక్కడలేని కోపమువచ్చినది. ఒక్క పరుగున వానిం డాసి నికుంభా తిరుగవచ్చితివా? ఎన్ని చెప్పినను నీ యాగడము మానకుంటివి. ఈసారి గాచికొనుము నీ మదము సదమదము జేసెద నని మహాక్రోధముతో వానిపై కురికితిని.

నన్ను చూచుటతోడనే వాఁడు తోకతెగిన పిట్టవలె వెనుకకు జూడకుండ కాలికొలఁది పారిపోయెను. వానిని వెంబడించి పోయిన నక్కాంతాలలామ నెడబాయ వలసి వచ్చునేమో యను భయంబున నేనచ్చటనే నిలచితిని. అయ్యంగనామణి నన్నుఁ జూచి విభ్రాంతయయ్యెను. మేమిరువుర మామె నాసించి తిరుగుచున్న సంగతి పాప మామె యెరుఁగనే యెరుఁగదు. మరియును మేమన్నదమ్ము లిద్దర మొక్క పోలిక నుండుటచేత నామెకు వింతదోచి యుండవచ్చును. అప్పుడు నే నామె కిట్లంటిని.

సారంగనయనా ! ఏల నీకీ రిచ్చపాటు. వాఁడు నా తమ్ముడు. నేను నిన్నిందుఁ దీసికొనివచ్చుట యెరింగి నీకై యాసఁగొని వాఁడు మనల వెన్నంటి వచ్చెను. ఇదివరకు నా చేత నొకసారి పరాభూతుఁడై యిప్పుడు సిగ్గులేక మరల వచ్చినాఁడు. ఇంకొక మారు నీ సమీపమును జేరినయెడల వానిని తుదముట్టింపక మానను. మానవతీ శరోమణీ ! ఆ సెజ్జనుండి లేచి యచ్చటకేగితివి. నీకొర కీయరణ్య మంతయును వెదకుచుంటిని. అబ్బా ! నీ వియోగంబునకు నేనెంత పరితపించితి నను కొంటివి ? ఇప్పటికైనను కనిపించి నాకు నేత్రోత్సవం బొనరించితి వదియు చాలును. ఇంతవరకు నేపడిన శ్రమ యంతయును నిన్ను జూచుటతోడనే మటుమాయమయ్యెను. నాపై నింత కఠినముం బూనదగునా! నిన్నిచ్చటకు బలవంతముగాఁ దీసికొనివచ్చి శ్రమ‌ పెట్టితినని నాపై కినుక వహింపకుము. యెంత శ్రమ పెట్టితినో యంత సుఖ పెట్టుటకు నేను సిద్ధముగా నుంటిని.