పుట:కాశీమజిలీకథలు-12.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రత్నచూడుని కథ

33

యంబున వేధించుచుండుటచే నే నచ్చటకుఁ బోఁజాలక యావల్మీక గర్భమందే తల దాచుకొనియుంటిని.

ఇట్లున్న నన్నా కిరాత బాలకుం డెట్లు కనిపెట్టెనో తెలియదు. ఆ పుట్ట నంతయుం దెగఁద్రవ్వి యందు యోగనిద్రనున్న నన్ను జావగొట్టెను. అంతటితో నూరుకొనక తోకఁబట్టి యాడింప సాగెను\. ఎంత విరక్తుడైనను‌ సహజగుణం బొక్కొక్కప్పుడు గనిపించుచుండును. నాజాతి స్వభావమునుబట్టి యించుక యలుక బట్టి యాబాలకుని మదీయ విషజ్వాలల పాలుజేసి యాప్రాంతమందలి వేరొక పుట్ట లోనికిఁబోయి యందు విశ్రమించి యుంటిని. ఆ శబరులు నాకై వెదకుచున్నప్పుడే యోగవిద్యా ప్రభావంబున వారి కదృశ్యుండనైతిని. దేవరయేతెంచి యాపుట్ట త్రవ్వించు నప్పుడు యోగీంద్రునివలె నున్న నేమియుం దెలిసికొనఁ జాలరని యట్లు గనంబడితిని. సర్వవిద్యా ప్రపూర్ణుండవగు నీయొద్ద నాచదువులు పనికివచ్చునా? నామాయ గ్రహించి మీరు నిగ్రహించినప్పుడు తేజోరూపుండనై పైకెగసి పక్షిరూపంబున పారిపోవఁజొచ్చి తిని. మీరు నన్ను వెంటాడించుచుండుట దెలిసికొనినప్పుడు నాకు మాగురువుగారి శాపము దలంపునకు వచ్చినది. మీరే యాదివోదాస మహారాజుగారని నిశ్చయించు కొంటిని. కాకున్న నన్నుఁ బరాభవింప శక్యంబుగాదు. మిమ్మింతవఱకుఁ దీసికొనివచ్చి శ్రమయిచ్చినందులకు చింతించుచున్నాను. ఇదియే నా కథ. మదీయ విషజ్వాలల మడ సిన శబరబాలక కశేబర మేమైనదో నేనెరుంగను. నా గురుదేవుని పాదంబుల సాక్షిగా నీ వించుకయు నెరుంగను. నా మాటలను నమ్మినను నమ్మకున్నను దేవరయే కర్తలు నన్ను మీమిత్రునిగా నాశ్రితునిగా సేవకునిగా నిఁకమీదభావించి రక్షింపఁగోరుచున్నాను. మీ శాసనము నాకు వర్తింపకుండుటకు సమ్మతింపఁ బ్రార్దించుచున్నాను. భూలోకంబున నుండుటకు నా కనుజ్జ యొసంగ వేడుకొనుచున్నాను. సర్వదా మీకు హితమునే తలం చుచు తపోవృత్తిమై యావింధ్యారణ్యము నాశ్రయించి యుండగలవాడఁనని యతి దీనుఁడై పలుకుచున్న వానిమాటల కాపుడమియొడ యండలరి యభయహస్తమిచ్చి యప్పుడే పంపివేసెను.

అని యెరిగించువఱకు వేళ యతిక్రమించుటయు నబ్బలి దానవేంద్రుం డప్పటికి కొల్వుచాలించి తరువాత వృత్తాంతము మరునాఁడు కుంభునివలన నిట్లు తెలిసికొన సాగెను.