పుట:కాశీమజిలీకథలు-12.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

విషయము ప్రభువగు వాసుకితో నా తండ్రి విన్నవించెను. అతండు మా గురువు గారిని భయపెట్టి యా రత్నము నెట్లో తెప్పించెనుకాని ప్రభావంబెరింగి మా తండ్రి కిది యొసగక మీరొకప్పు డిచ్చెదనని సమాధానముచెప్పి పంపివేసెను. తరువాత నెన్నిసారులు దానికొరకు వానిని ప్రార్దించినను నెప్పటి కప్పుడెద్దియో చెప్పి పంపి వేయుచుండెనేగాని దాని నెప్పటికిని మా కిచ్చి యుండలేదు. అయ్యది వాసుకి తనూ జాతకు శిరోభూషణముగా నేర్పరుపఁబడెనని తరువాతఁ దెలిసినది. ప్రభువపహరించిన వస్తువు తిరిగి రాదని యెరింగి దానియందు నిరాశఁజేసికొని మేమూరకొంటిమి.

రత్న మూడఁబెఱికికొనఁబడినది మొదలు నాకనవరతము తలపోటు బాధ యుండునది. వింధ్యారణ్యంబున దివ్యప్రభావ సంపన్నుఁడగు యోగీంద్రుఁ డుండుట తెలిసికొని మాతండ్రి వాని యొద్దకు నన్నుఁ దోడ్కనిపోయి వాని పాదమూలంబునఁ బడవైచి రక్షింపుమని ప్రార్థించెను. ఆ యోగీంద్రుండు నాబాధ నెఱింగి తన సవ్య హస్తము సాచి నామస్తకమునఁ బెట్టి యెద్దియో మంత్రించి యిప్పుడెట్లున్నదని యడి గెను. వానిహస్తప్రభావమో మంత్రశక్తియో నే నెరుంగఁ గాని నాబాధయంతయు మాయమైపోయినది. వానిప్రభావమును స్తుతించుచు మాతండ్రి వీనిని దమశిష్యునిగా స్వీకరించి కొఱంతలగు విద్యలఁజెప్పుడని ప్రార్థించి వాని యనుమతి నన్నందుంచి నిజ నివాసమునకుఁ బోయెను.

అమ్మహానుభావుని యుపదేశ విశేషంబున నాకు సమస్తవిద్యలు గ్రమం బునఁ గరతలామలకము లయ్యెను. పెక్కు యోగ విశేషంబు లాయన నాకెరింగించెను. ఒకనాఁడా ఋషిపుంగవుని సపర్యల యందించుక యేమరుపాటు జూపితినని నాపై నలుగుచు మూర్ఖుఁడా విద్యాగర్వంబున గురుతిరస్కార మొనరించుచున్న నీవొక్క మానవునిచేతఁ బరభూతుండవు గాఁగలవని శపించిన నేను కటకటం బడి వాని ననేక విధంబుల శాపము గ్రమ్మరింపఁ బ్రార్దించితిని. అతం డెట్టకేల కించుక శాంతించి యాశాపము నీవు వృద్ధుండవైయున్న తరి దివోదాసుండను మానవేంద్రుని కతంబున సంభవింపఁ గలదు. అట్లు సంభవించినను వెంటనే వానికి నీవు పరమాప్తుడ వగుదు వని యానతిచ్చెను.

పిదపఁ గొన్ని దినంబుల కాయోగీంద్రుండు సిద్దిబొందెను. నా తలి దండ్రులు గతించిరని యంతకుముందుగనే తెలిసినది. నాకు భోగములయందు విర క్తి బుట్టినది. జన్మభూమికి తిరిగి పోవుటకు మనం బొప్పినది కాదు. ఆ మునీంద్రు నాశ్ర మంబుననే తపోవృత్తి నుంటిని. ఇట్లు పెక్కు వేలేండ్లు గతించిన పిమ్మట నీవు భూరాజ్య పట్టభద్రుండవై నాగకులంబు వారెల్లరు పాతాళంబున కేగవలయునని శాస నము చేసితివి.; ధర్మబద్దుండనై నేనును వల్మీక వివరంబులోని కేగి జన్మస్థలమందలి యనురాగంబు కతంబునను రసాతలంబున నాకు గలిగిన యవమానంబు హృద