పుట:కాశీమజిలీకథలు-12.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రత్నచూడుని కథ

31

యము బన్నితిని. గుండెలో పోటనఁగా నీ కర్దమైనదా ? పంచశరుని పూముల్కులు గాఢముగా నెడదనాటి బాధించుచున్నవని భావము. ఇప్పటినుండి మనకీమాటలే సాంకేతి కము లగుఁగాక. అని చెప్పుచు వానిని ప్రక్కగదిలోనికిఁ గైదండయొసంగి తీసికొని పోయి కొంత సేపటికిఁ దిరుగవచ్చి యధాస్థానమున నేమియు నెరుఁగ నట్లు శయనించి నది. కన్నులారఁ జూచి చెవులార వినయున్న నాకు వారిచేష్టలు మిగుల నాశ్చర్య విషాదములం గలిగించినవి. తెల్లవారుసరికామె బాధ మటుమాయమైనది.

మరియొకనాఁడు నేనొంటరిగా నున్న పఠనమందిరమున కా సరోజముఖీ వచ్చి నాతో ముచ్చటలాడఁదొడంగినది‌. క్రమక్రమముగా శృంగార ప్రసంగములోనికి దిగినది. పిమ్మట పరిహాసములాడఁ గడంగినది. తుదకుఁ దనతోఁ గలియరమ్మని సిగ్గు విడచి యడిగినది. నేను దాని మాటలకు మారేమియుఁ బలుకఁజాలక నిశ్చేతనుఁ డనై గొంత తడవుంటిని. మొదట నమ్మదవతి సౌందర్యంబు గాంచి నా మనంబు గొంచెము సంచలించినది. దాని స్వైరిణీవృత్తి దలంపునకువచ్చి విరక్తి గలిగినది. అన్నిటికన్న నెక్కుడుగా గురుపుత్రిక యన్నమాట హృదయంబునఁ బ్రతిధ్వనింపఁ గంపము జనించినది. అప్పుడెట్టులో యాపాప జవరాలిని మోసగించి యావలకుఁ బారిపోయితిని.

అందులకై యీర్ష్యవహించి యామించుబోణి తల్లితో నామీద లేనిపోని నేరము లెన్నేనిఁ జెప్పి నేనామెను బలాత్కరించినట్లు నమ్మకము బుట్టించినది. నేను భయకంపితుండ నై యెవ్వరితోడను మాటలాడలేదు, నిజమెరిఁగించి గురుపుత్రికకుఁ జెడ్డపేరు దెచ్చుట నా కిష్టము లేకుండెను. నన్నెల్లరు నిందింపఁ దొడంగిరి. గురువు గారికిఁ గూడ యీ వార్త క్రమక్రమముగా వినికిడియైనది ఆయన నన్నుజూచి బుద్ధి హీనుఁడా ! నేఁడు మొదలు నా యింటి కెన్నఁడును జేరవలదు. పొమ్మని కఠినముగా బలికెను నేను వాని పాదముల మీఁద పడి క్షమింప నెంత వేడుకొన్నను‌ దయగలుగ లేదు. కోపము ద్విగుణీకృతమైనది. అందు నన్ను జితుకఁగొట్టి నా శిరంబున వెలయు చున్న రత్నమును బలవంతముగ నూడఁబెరికికొని వివశుండ నైయున్న నన్ను బదు గురచే నూరిబైట పారవేయించెను.

పుట్టుకతోఁబుట్టిన రత్నముపోయెను. గురుద్రోహము జేసితినను నపనింద మీదఁబడెను. హతభాగ్యుండనగు నేను గొంత తడవునకు తెలివివచ్చి మెల్లనలేచి రత్న మూఁడదీయుటచేత గాయపడిన శిరంబు నిమురుకొనుచు నెవ్వరికింజెప్పక‌ యవమాన సంపీడితహృదయుండనై భూలోకంబునకు వచ్చితిని. నా యవస్థనంతయు నా తల్లి తండ్రు లెరింగి మిక్కిలి‌ విచారించిరి. శిరోరత్నము పోయినందులకుఁ గడుంగడు దుకు పిల్లిరి.

మా తండ్రి మరియొకప్పుడు నాగలోకమున కరిగి యా రత్నమిమ్మని మా గురువుగారిని నెన్నివిధముల బ్రతిమాలినను దానెరుంగనని బొంకి పంపివేసెను. ఈ