పుట:కాశీమజిలీకథలు-12.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

దండ్రులచే నతి గారాబముగాఁ బెంపఁబడితిని. నా యౌదలం బుట్టుకతోడనే పుట్టిన యనర్ఘరత్నముం బట్టి రత్న చూడుడఁని నాకన్వర్ద నామమయ్యెను. ఆ రత్నప్రభలు దిగంతముల వ్యాపించు చుండినవట. ఒకనాఁడు నా తిల్లితండ్రులు పుత్రులతో నాగ లోకంబున కేగ నందొక తపస్సిద్ధుండు రత్న ప్రభలచే మెఱయుచున్న నన్నుజూచి దగ్గరకుఁ దీసిఁకొని ముద్దాడుచు నా తలపైనున్న రత్నము దివ్యప్రభావము గలదనియు దానినిఁ బడసిన వారికి మృత్యుభయంబు లేదనియు నేమేమో విశేషంబులు నాతల్లి దండ్రులతోఁ జెప్పెనట.

ఆ సిద్ధుని పలుకులు విని నదిగోలె నాయందు మా వారికి యనురాగము వృద్ధిబొందినది. నాగలోకంబులో మాతల్లికి దగ్గర చుట్టమైన యొకనాగవంశ శ్రేష్ఠు నకు నన్నప్పగించి విద్యాబుద్ధులు సెప్పించిరి. నేనక్కడఁ బెక్కువిద్య లభ్యసించితిని. నాకు చదువుచెప్పుచున్న గురువుగారికి విద్యుత్ప్రభయను చక్కని కూతురు గలదు. దానిని మేనత్తకొడుకునకిచ్చి పెండ్లిజేసిరి. వాఁడువట్టి మూర్ఖుఁడు రూపమునకు దున్న పోతు. చదువుసంధ్యలు పూజ్యము. భార్యాభర్తల సంబంధ మెట్టిదో యెరుంగడు అట్టి దంపతుల కాపురము వినినవారికిఁ జూచినవారికి హాస్యాస్పదముగా నుండును గదా ! శృంగారరసము వానియందు శూన్యమని చెప్పవచ్చును. అట్టి భర్తతో భార్యకు పొత్తెట్లు కుదురును.

దానియత్త రాకాసి, మామ చండశాసనుఁడు. దానంజేసి యత్తింట నున్నప్పుడెప్పుడును నామె విలాసచాతుర్యములఁ జూపుట కవకాశములేకుండెను. ఎద్దియో వంకఁబెట్టుకొని తరుచు పుట్టింటనే నివసించుచుండునది అచట దానిస్వేచ్ఛా విహారమున కాటంకము సెప్పు వారెవ్వరు? ఇరుగుపొరుగులఁగల బొజంగుల కామె తంగేటి జున్నువలె నున్నది.

నేనొకనాఁడు వారింట రాత్రి చాలాసేపటివరకుఁ బాఠములు జదువుకొను చుంటిని. అర్దరాత్రంబున నా జవ్వని మూల్గుచు నెద్దియో బాధ నభినయింపఁ దొడంగి నది. దానితల్లి నా సన్నిధికేతెంచి అమ్మాయికి గుండెలో పోటు వచ్చినది. చేరువ నున్న వైద్యుని సత్వరమ తీసికొనిరమ్మని‌ నన్ను నియోగించినది. గురుపత్ని యానతి నేనేగి యాభిషగ్వరుని క్షణములోఁ దీసికొనివచ్చితిని. వాఁడు వచ్చి యామెం బరీక్షించి యెద్దియో మందిచ్చి యా రాత్రి మాటిమాటికిఁ జేయి చూచుచుండ వలయు నని చెప్పి యచ్చటనే పరుండెను. కొంతసేపటికి మేమందరము నిద్రా ముద్రితుల మైతిమి. నాకుఁ దిరుగ మెలకువ వచ్చుసరికి వైద్యుని సన్నిధిం గూర్చుండి యావిద్యు త్ప్రభ వానితో నెద్ధియో ముచ్చటించుచుండెను. దానికి నేను విస్మయంబందుచుండ నా సుదతిమాట లిట్లు వినంబడినవి.

మనోహరా ! నీ వీమధ్య నన్నుఁబొత్తిగా మరచిపోతివి. నీ విరహ మేను సైరింపఁగలనా? ఈ రాత్రి నీతో సుఖింపఁదలంపుకలిగి నిన్నిందురప్పించుట కీయుపా