పుట:కాశీమజిలీకథలు-12.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుంభ నికుంభుల కథ

29

పాలు జేసితిఁ గదా? యని నిందించుకొనుచు ఘాతుక మృగం బెద్దియైన వచ్చియామెం గబళించిపోయిన దేమో యని భయంపడుచు సేదదేరి యాప్రాంతముల నెందైన నరిగి యుండునేమో యని యాసఁగొనుచు నీరీతి ననేక విధంబుల దలంచుచు నెట్టకే నటఁ గదలి యాప్రాంత భాగంబుల నతిశ్రద్ధతో వెదుక నారంభించితిని.

చూచిన పొదరిండ్లే చూచుచు‌ నడచిన దారినే నడచుచు ననంగ మోహినీ ! యని పిలచుచుఁ గనంబడిన తరు లతాగుల్మాదుల వివిధ శకుంతసంతానంబుల నానా విధ మృగ సందోహంబుల నామనోహారిణింజూచితిరే యని యున్మత్తుండనై యడు గుచు నారీతినాప్రొద్దంతయుఁదిరిగితిరిగి వేసరి యొక విశాల శిలావేదికపై హతాశుండనై చతికిలంబడితిని.

ఇంతలోఁ బ్రాంతమందెద్దియో సందడి వినఁబడినది. దాని నెరుంగఁ గుతూ హం పడుచుఁ జయ్యన లేచి యోవైపునకు మెల్లగా నడచితిని. ముందొకచో నొక పురుషపుంగవుండు వేఱొకనిని చేత జుట్టుపట్టుకొని నిలిపి సవ్య హస్తంబునంగల కటారి నెత్తి వానితల నుత్తరింప నూహించుచుండెను. పట్టుపడ్డవాఁడు చేతులుజోడించు కొని మహారాజా! రక్షింపుము, రక్షింపుము. నీప్రభావం బెరుంగక యిన్ని చిక్కులం బెట్టిన నా తప్పులన్నియును మరచిపొమ్ము. నీ దాసానుదాసుండనని ప్రార్థించుటయు నామహాపురుషుండు వానింగరుణించి యెత్తిన కత్తి దింపి జుట్టువిడచిపెట్టి‌ యిట్లనియెను.

ఓరీ ! నీవెవ్వఁడవు సర్పంబవై వనచర బాలకు నేమిటికి జంపితివి. వాని కళేబర మెందులకు గుప్తపఱచితివి. నిక్కము వక్కాణింపుము లేదేని నిన్ను క్షమించు వాఁడనుగాను. అని గద్దించియడిగిన వానికి రెండవ వాడిట్లు తనకథ చెప్పందొడంగెను.


306 వ మజిలీ

రత్న చూడునికథ

మహారాజా ! నేను నాగవంశము వాఁడను. మాపూర్వులెవ్వరో రసాతలము విడిచి భూలోకమునకు కాపురమువచ్చిరఁట. వారందరును వింధ్యారణ్యము శరణ్యముగాఁ జిరకాలము స్వేచ్చగాఁ గాలముగడపిరి. నాతండ్రిపేరు పింగళాక్షుఁడు. వానికి విరజ యను భార్యయందుఁ బదివేల పుత్రులు, నందరు పుత్రికలును జన్మించిరి. వారిలో జ్యేష్ఠుఁడను నేను. నాపేరు రత్నచూడుఁడందురు. మేము పుడమియందే నివసించి యున్నను నాగలోకమునందుఁగూడ మా బందుగు లెందఱోకలరు. వారింజూడ మే మప్పుడప్పు డాలోకంబున కేగుచుందుము. నేను చిన్ననాఁటనుండియును తల్లి