పుట:కాశీమజిలీకథలు-12.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

మోహనాంగి లావణ్యామృతమునఁ కన్నులారఁ గ్రోలుచు సన్నిధిం గూర్చుండి పుష్ప గుచ్చములతో నామెకు విశ్రాంతి కలుగునట్లు విసరుచుంటిని. ఇంతలో నికుంభుఁ డచ్చటికి వచ్చి చేరెను. వానిం జూచినతోడనే నాకరికాలి మంట నెత్తి కెక్కినది. కన్నుల నిప్పుకణంబు లురుల వాని నీక్షించుచు పండ్లు పటపటగీటుచు మహాక్రోధం బున నొడుగఱచి హుమ్మని లేచి వానిపైఁబడి జుట్టుపట్టుకొని బిరబిర దూరముగా నీడ్చుకొనిపోతిని.

వాఁడును నాపట్టుతప్పించుకొని చేరువనున్న దారుణ పాషాణం బెత్తి నాపై విసరెను. అది తప్పించుకొని యొక వృక్షశాఖం బూని వానింగొట్టితిని. కొండొక దీర్ఘ శాఖను బెరికికొనివచ్చి వాఁడు నాపై గవిసెను ఇట్లు మేమిరువురము బెద్దతడవు శిలా వృక్షాది సాధనంబులతో సమముగాఁ బోరితిమి. పిదప బాహాబాహి కచాకచి ముష్టా ముష్టి గెలుపోటములు లేఖ సంబంధ బాంధవ్యంబులం దలంపక యా చంపకగంధి కొఱకు నేకపలాపేక్షా నిరూఢి మూఁడహో రాత్రంబులు ద్వంద్వయుద్ధ మొనరించి తిమి. అప్పటికి నికుంభుని సత్వంబు గొంత తఱుగుట నెఱింగి నేను విజృంభించి దంభోళి సదృక్షంబగు పిడికిటితో వాని వెన్ను పై గట్టిగా గుద్దితిని, దానితో వాఁడు మొగంబున రక్తంబు గ్రక్కుచు వెన్నిచ్చి పారిపోయెను. కొంతదూరము వఱకు వానిని తరుముకొనిపోయి మూఢుఁడా ! యిప్పుడైన బుద్ధిఁగలిగి యుండుము. పో పొమ్మని పలుకుచు వెనుకకుఁ దిరిగి యనంగ మోహినినుంచిన గుహా ముఖంబున కతిరయంబున నేతెంచితిని.

కాని యావేదండగమన యచ్చటలేదు. మూఁడు నాళ్ళ నుండియుఁ జేయు చున్న సమరము వలనఁ గలిగిన యాయాసంబంతయు నొక్కసారి నన్నప్పు డావే శించినది. సన్నిధిం బడసిన నిక్షేపమును గాళ్ళతోఁ దన్నుకొన్నట్లయ్యెను. అంత శ్రమ పడి గంపెడాసతోఁ గొండంత కోరికతో చేసిన నా ప్రయత్నమంతయు విఫలమైనదని నా హృదయము సహస్రశకలములైనది ఏమిచేయుటకు నెందుఁబోవుటకుఁ దోచక యా బాలామణిని పరుండఁబెట్టిన సెజ్జపై మేనుఁ బడవైచి తద్విరహ వేదనా బోధూయ మాన మానసుండనై కొంతతడవొడలెరుంగకుంటిని. అంతవరకు చెప్పి భావోద్రేకంబు వలనఁ గలిగిన పరితాపంబు కతంబున నొడలు వివశయై క్రిందపడెను. తోడనే బలి చక్రవర్తి పరిచారకులచే వానికి శైత్యోపచారంబులు చేయించుచు తరువాత వృత్తాంతము వాఁడు స్వస్థతంబొందిన వెనుక వినవచ్చునని నాటికాసభ జాలించెను.

మరునాఁడు యధాకాలంబునకుఁ గుంభునిఁ బిలిపించి యవ్వలికథ జెప్పు మని బలిచక్రవర్తి యాజ్ఞాపించుటయు వాఁఢిట్లు చెప్ప దొడంగెను.

ప్రభువరా! నేనట్లు లతాపర్యంకంబున ననంగ మోహినీ విరహాతురుండనై పడియుండి గొండొక తడవునకు నాకు నేను యుపశమించుకొంటిని. పిమ్మట మందుఁ డనై యంతఃపురంబుల సుఖంబుగాఁ గాలంబు బుచ్చుచున్న యబలందెచ్చి యడవి