పుట:కాశీమజిలీకథలు-12.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుంభ నికుంభుల కథ

27

నేనట్లు పోవుచుండ నా సోదరుం డెక్కడనుండి చూచుచుండెనో, నా పోకఁ గనిపెట్టి వెనువెంట రాఁదొడంగెను.

వానింజూచి నేనులికిపడి, నికుంభా ! నీవేమిటికి నా వెంటవచ్చెదవు. నిలు నిలుమని పలుకుచున్న నన్నుపలక్షించివాఁడిట్లనియె. సోదరా ! ఈ దర్వీకర సరో జానన నీక్షించి నప్పటినుండియు నా చిత్తంబంగజాయత్తమై యుత్తలం బడుచుండెను. నీకుఁ దెలియకుండ నిమ్మత్తకాశిని నెత్తుకొని పోఁదలంచుచు నవ్వనంబున నొకచోఁ గన్మొరంగియుండ నేనెరుంగకుండ ముందుగ నీవే యాపనిఁ జేసితివి. సంతసం బయ్యెను. నీవీ రాకేందువదన మేనంగల యాభరణము లన్నియుం దీసికొని యమ్ము డితను నాకిమ్ము. మన్మనోభిలాషం దీర్చికొనియెదనని చెప్పుచున్నవాని నాక్షేపించుచు నేనిట్లంటిని.

ఔరా ! నీవే నవరస రసికుండగు పురుషుండవు కాఁబోలును. నేనీ బాలా మణిని మణిమండలముల కాసించి తెచ్చితి ననుకొంటివేమి? కావలసిన నా నగలన్నియు నీకే యిచ్చివేసెదను. వానింబుచ్చుకొని పొమ్ము. మచ్చికమీరఁ నిచ్చిగురాకుఁ బోడితో ఐచ్చవిల్తుని కేళిఁగూడి నే సుఖించెదంగాక యని నా యభిమతంబు వాని కెరింగించి తిని. వాఁడంతంబోక యనునయ వచనంబుల వెండియు నా కిట్లనియె. అన్నా ! మనమిరువురము సహోదరులముగదా ? అందును నవిభక్తులము. ఒకరు సంపాదించిన దానియందు రెండవ వానికిఁగూడ సమాన భాగముండును. కావున నీవు తెచ్చిన యి చ్చిగురుబోణిం ననుభవించుటకు నాకును దాయ భాగపు హక్కు. గలదు. న్యాయరీతిని మన మిరువుర మీనాతి నాకతప్రేమఁ గామోపభోగంబుల సమానముగా నుపయో గించు కొంద మిందుల కొడంబడు మని కోరిన వాని వదలించి యోరి మూర్ఖా? అవిభక్త సోదరులకు సంపాద్య వస్తువులందు సమానమైన హక్కుగలదని యన్నభార్య ననుభవింపఁ దలంతువఁటరా! జ్యేష్ఠసోదరుని యాలి తల్లితో సమానమని చెప్పుట యెరుంగవా! ఓరోరి! మాతృద్రోహి! కులపాంసనా! యుక్తాయుక్తంబు లెరుంగక నోటికి వచ్చినట్లెల్లఁ బ్రేలుట మాని యవలంబొమ్మని తీక్షణముగాఁ బలికి వాని నెదురు దిరిగి యొక్కతన్నుఁ దన్నితిని. దానితో వాఁడు కొంతదూరము. తిరిగిపడి మగిడి మావెంట వచ్చుటకుఁ ప్రయత్నించుచుండెను.

ఇంతలో నేనతిరయంబున నాయంబుజానన నెత్తుకొని పోవుచుంటిని. ఆబాలా శిరోమణి వివశయై యున్న కతంబున నీ గొడవ యేమియు నెరుంగదు. అట్లు నేను పోయిపోయి సప్తాధోలోకంబులం దిరిగి తిరిగి యెందును ననుకూలమగు తావు గనంబడనందునఁ దిన్నఁగా భూలోకంబున కేగితిని. అందు దివోదాసుని శాసన భయంబున నురగలోక వాసులు జేరరారని నిర్భయముగా హిమశైల శిఖరంబు జేరితిని. అందొక సుందర దరీముఖంబున నాకంబుఁ గ్రేవను మెల్లగా దింపి యుచితరీతిని ప్రాంత లతావితానంబులం దెచ్చి శయ్యఁ గల్పించి దానిపై నామెను పరుండబెట్టి యా