పుట:కాశీమజిలీకథలు-12.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

కొని రమ్మనుచున్నారు. శేషవాసుకి ప్రముఖులందరు బరివేష్టించియుండఁ బ్రభువు వారిప్పుడు కొల్వుదీ‌ర్చి యున్నవారని చెప్పుచు కుంభుని వెంటఁదీసికొని వైరోచసుని సన్నిధికిం బోయెను.

సభలో వాసుకిం జూచినతోడనే కుంభుఁడు నిశ్చేతనుఁడయ్యెను. దాన వేంద్రుని యెదుర నిలుచుటకుఁ గంపించుచుండెను. తక్కినవారిని తేరిచూచుటకు మొగము జెల్లకుండెను. అట్లు భయవిహ్వలుండై యున్న కుంభునిఁజూచి దానవేంద్రుం డిట్లనియె. కుంభా ! ఈ మధ్య నీ వెచ్చటి కేగీతివో యేమేమి చేసితివో పూసగ్రుచ్చి నట్లు‌ చెప్పవలయును. నిజమించుకయేని దాచినచో నీ మాన ప్రాణంబులు దక్కవని నమ్ముము. అని గద్దించి యడుగుటయు వానికి భయోద్రేకంబున మాటయే వచ్చినది కాదు. వెండియు చక్రవర్తి వాని నుద్దేశించి మాటాడవేమి ? ఈ నడుమ నెన్నఁడేని వాసుకితనూజాత ననంగమాహినిని జూచితివా ? నీ వట్లు మౌనము వహించిన వదలి పెట్టము. నీ సంగతి యంతయును మాకు తెలిసినది. నిజము జెప్పకున్న తీవ్రశిక్షలం బొందెదవని యలుకమయి నడుగుచున్న రేని యెదుర బొంకుటకు భయంపడి యా రాత్రించరుండు వారికి నమస్కరించుచు నిట్లనియె.

ప్రభువరా ! తప్పు చేసితిని. మూఢుండనై యొనర్చితిని. రక్షించినను శిక్షించినను దేవరయే కర్తలు. సంగతినంతయు నెరింగన ప్రభువుల సమక్షమందు నేను నిజమును దాపరికము సేసినఁ బ్రయోజనమేమి గలదు. అని తనవృత్తాంతమిట్లు చెప్పందొడంగెను.

దేవా ! నేను దేవర యధికారమునకుఁ లోఁబడిన రసాతలవాసుండను. వికటహాసుని తనయుండను కుంభుఁడనువాఁడను. నా సోదరుఁడు నికుంభుఁడను వానితో నేనొకనాఁడు విలాసార్థ మీ వాసుకి ప్రముఖ వాతాశనప్రవరులున్న వైపునకుఁ బోఁతిని. అందుఁ గేళికోద్యానంబున నుచిత సఖీపరివృతయై విహరించు వాసుకి పుత్రికా రత్న మనంగమోహిని రూపలావణ్యాదులం జూచి మోహపరవశుండనైతిని. తదీయ లావణ్యశృంఖలా బద్దుండనై ముందడుగైనఁ బోవఁజాలక‌ యా పూవు తోటలో నొక మంజునికుంజమధ్యంబునఁ బొంచియుండి యధేచ్చా విహార ప్రమోదమానసాంభోజయై చెలంగియున్న యా యంగనామణి సౌందర్యలహరీతరంగ పరంపరాబద్ధ నయన రాజీవద్వయుండనై యన్యమెరుంగకుంటిని.

ఇట్లు తదేక ధ్యానాయత్తచిత్తుండ నైయున్న నాకొక చెడుబుద్ధి పుట్టినది. ఆ విలాసవతిని బలవంతంగా నెత్తుకొనిపోయి యొక్క వివిక్తప్రదేశంబున నిష్టోపభోగంబుల నానందింపవచ్చునను నిశ్చయముతో నేనందు నిరీక్షించియుండియదనెరింగి యువ్వెత్తుగా నామె సన్నిధికేగి చెలియకత్తె లాక్రోశించుచుండ నామదగజగామినిని బలవంతముగా నెత్తుకుని పైకెగసిబోయితిని ఆ లలితాంగి వలలోఁ జిక్కిన శకుంతళాబకము వైఖరి నాసందిటఁ జిక్కి యొక్కుమ్మడి రోదనముసేయుచున్నను విడువక కడురయంబున