పుట:కాశీమజిలీకథలు-12.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుంభ నికుంభుల కథ

25

చివర కవి యన్నియును వ్యర్దములయ్యె. ఆ పాపపు దివోదాసుండు నాకొరకచ్చటి కేలదాపురించవలయును వానిచేఁ బరాభూతుండ నగుట కేనింతయుఁ జింతింపను. నీ యథర సుధారసము తనివిఁదీర నొకసారియైనను గ్రోలఁజాలనైతినిగదా యని మిగుల వగలం బొగులుచుంటిని. నీనిద్దంపుచెక్కుటద్ధంబుల నెన్నఁడును ముద్దాడనైతినని పల వింపుచుంటిని. నీ గాఢాశ్లేషసుఖంబున కొకనాఁడైనను నోచుకొనకుంటీనని విలపించు చుంటిని అన్నా ! నావంటి మందభాగ్యుఁడెందైనఁగలడా ? అన్ని దినంబులు వివిక్త ప్రదేశంబుల నొంటిగాఁ జిక్కిన చక్కెరబొమ్మను మక్కువమీర ననుభవింపఁ జాలని నన్ను బోలు మూఢుండు ముల్లోకముల నెందేని యుండునా ? ఏమనిన నేమి కోపమువచ్చునో యేమిచేసిన నేమివిరక్తిగలుగునోయను భయంబున ఖిన్నుఁడనై నిన్నూరక కన్నుల కరవుదీరఁ జూచుచుండుటయేగాని యేసాహసమును జేఁయజాల నైతిని. అయ్యయ్యో ! ఇఁక నా జన్మ మధ్యంబున నిన్నుఁ జూచుభాగ్యంబు నాకబ్బఁ గలదా ? నీతో ముచ్చటించు పుణ్యంబు నాకు తటస్థింపఁగలదా ? నీతోఁ గలసి మెలసి సుఖించు వైభవంబు నాకు పట్టగలదా ? అన్నియును నీటిమీది వ్రాతలైనవిగదా ?

నన్ను పరిభవించిన‌ యా రాజు భాగ్యంబు పండెనా ? వాని కొరకేనా నేను నిన్నక్కడకుఁ జేర్చినది. అబ్బా ! ఈ విరహంబునకు నేనోపఁజాలను కత్తిపోటులతో ప్రాణంబులు పోయినను బాగుండును గదా ! నేను వెండియు జీవించి యేమి సౌఖ్యము బడయుదును. ఎవరిని సంతోష పెట్టుదునని యీ రీతిని బహుప్రకా రంబుల విలపించుచున్న వాని మాటలన్నియును విని యచటనున్న పరిచారకుఁడు దగ్గిరకుఁ జేరి యిట్లనియె.

కుంభా - నీ దేహమున కెట్లున్నది. పలవరించుచుంటివాయేమి ? తినుట కేమైన పదార్థముల దెమ్మందువా ? అని యడుగుచున్న వానింజూచి యారక్కసుం డిట్లనియె. అయ్యా ! నా కేమియు నక్కరలేదు. మీరెవ్వరు ? ఈ గృహమెవ్వరది ? నన్నిందేమిటికి కుంచితిరి ? ఇది యే లోకము ? మీరెవ్వని యానతి నా కిందుపచార ములఁ జేయుచుంటిరని యడిగిన నప్పరిచారకుం డిట్లనియె.

కుంభా ! ఇది ఏ లోకమా యెరుంగవా ? పాపము ! అంతపాటుబడి బ్రతికినవానికి నీకేమిదెలియఁగలదు, జెప్పెదవినుము. ఇది పాతాళలోకము. నేను బలి చక్రవర్తిగారి పరిచారకుఁడను. ఆ చక్రవర్తి యాజ్ఞానుసారము నీకీ చికిత్సాలయంబున నేను పరిచర్యల జేయుచుంటిని. నీ యారోగ్యమునకే యావైరోచని యనుదినము నెదురు చూచుచుండెను. అని చెప్పినతోడనే కుంభుఁడు నివ్వెఱం బడుచు నే మేమీ ! నేనెట్టకేలకు పుట్టగడికేవచ్చి చేరితినా ? బలిదైత్యేంద్రునకు నా యందిట్టియకారణ వాత్సల్య మేల కలిగినది. అని పలుకుచుండగనే మరియొక పరిచారకుఁడు పరుగు పరుగునవచ్చి దైత్యేంద్రుని యానతియైనది. వీనిని కొల్వుకూటమునకు వేగమ తీసి