పుట:కాశీమజిలీకథలు-12.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

దన్మయుఁడై కార్యమూఢుఁడై కొండొకతడవు మైమరచియుండెను. తద్విరహవేదనాదో ధూయమాన మానసుండై యా పురుషపుంగవుండు స్వయంప్రబోధింతుండై యిట్లని వితర్కించుకొనెను. ఔరా ! చేతికబ్బిన లిబ్బెను జారవిడుచు వానివలె నేనైతినిగదా‌ ? అనాధయై శరణంబు వేడిన యబ్బాలరత్నమును వెంగలినై కాపాడజాలక యాపద పాలు సేసితిని. నాకన్న కఠినహృదయుం డెందై ననుండునా ? దుర్మార్గులచేఁజిక్కి యా చక్కెరబొమ్మ చేసిన యాక్రందనము వినిన ఱాయియైనను వజ్రమైనను కఱం గును గాని నా హృదయము చలింపలేదు. ఇది యెంత దారుణమైనదో గ్రహింపఁజాల కున్నాను.


మ. అకటా ! నన్ను వరించినట్టి యబలన్‌ ప్రాంచచ్చుభాంగిన్‌ విభీ
     త కురంగాక్షిఁ ద్రిలోక సుందరిని నిర్దాక్షిణ్యతన్‌ దుచ్చు లి
     ట్లొకటన్‌ బల్మిహరింపఁగా నెఱిఁగి నే నుద్రేకమున్‌‌మాని యూ
     రక యెట్లుండఁగలాఁడ నాప్రియసతిన్‌ రక్షింప నేనోవనే?

ఆ నారీమణిని యంతరిక్షచరు లెవ్వరో మ్రుచ్చులించుకొనిపోయి యుందురు. చతుర్దశ భువనముల యందెందు దాచినను నెవ్వరడ్డంబైనను నా ప్రాణే శ్వరిని నేవిడిపించుకొని రాఁగలను. అట్లు చేయలేనినాఁడు నాకు మరణమే శరణ్యము. ఆ మోహనాంగి నెడఁబాసి నేనొక నిముసమైన సుఖంబున నుండఁగలనా ? బ్రహ్మదత్త వరప్రభావ సంపన్నుండనగు నే నీమాత్రపుపని సాధించుకొని రాఁజాలనా? అయ్యో! కిరాతబాలకుని గతియేమి ? వానిని బ్రతికించి యిచ్చెదనని యవ్వనాటులతోఁ బ్రతినఁ జేసి వచ్చితినిగదా ? వాని మాట పిమ్మటఁ జూచెదంగాక. ముందీసుందరీమణి యాపదఁ దప్పింపవలయునని యోగమార్గంబున నంబరంబున కెగసి యుత్తరదిక్కుగాఁ బోయెను.

305 వ మజిలీ

కుంభ నికుంభుల కథ

పాతాళంబున బలిచక్రవర్తి కుంభదానవుని యారోగ్యమును పరిచారకుల ముఖంబునఁ బ్రతిదినంబును దెలిసికొనుచుండెను. వాఁడు నానాటికి న్వస్థతంబొందుచుఁ గ్రమముగా నెలదినంబులకు లేచి యిటునటుఁ దిరుగుటకు శక్తి గలిగియుండెను. ఒక నాఁడు వాఁడు అనంగమోహినినిఁ దలంచుకొని యిట్లు విలపింపఁదొడంగెను. హా! మన్మనోపహారిణీ ! అనంగమోహినీ ! నీకొరకు నేనెన్నెన్ని యిడుమలం బడితినే !