పుట:కాశీమజిలీకథలు-12.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మణిగ్రీవ జలంధరుల కథ

23

జయంతాదుల నధికరించి త్రిలోక మోహజనకంబై యున్నది. అనురూప వర సమా గమాకాంక్షితురాలనై యున్న నన్నీ నక్తంచరుం డిచ్చటికి తెచ్చి నాకెంతేని యుప కార మొనర్చెను. త్రికర్ణణంబుల మిమ్మె ప్రాణేశ్వరునిఁగాఁ గోరుచున్నాను. నన్ను మీపాదసేవకురాలిగా స్వీకరించి కృతార్దురాలిఁజేయుఁడని ప్రార్థించుచున్న యా యన్నుమిన్న కాపురుషపుంగవుండు మందహాస భాసురముఖారవిందుఁడై యిట్లనియె.

మదవతీ ! నీ సౌందర్యమెంత జూచినను తనివి తీరనిదిగా నుండెను. నీ లావ ణ్యము హృదయాకర్షంబుగా నొప్పెను. నీవచోవైఖరి సుధా మధురమై చెలంగెను. నీ వాలుచూపులు మారునిచేత తూపులై మనోహరము లయ్యెను. ఇట్టి త్రిలోకైకసుందరి తనకు దాపరించుచుండ నంగీకరింపని మందమతి యెందై ననుండు‌నా ? కాని నేనిపు డొక కార్యదీక్షయం దున్నవాఁడను. అయ్యది నెరవేర్చి నీ యభీష్టంబు దీర్చఁగల వాఁడను. అంతదనుక నిన్ను నీయాప్తులసన్నిధిఁ జేర్చెదను. వారెందున్నవారో యెరిఁ గింపుమని యనుచుండఁగనే యొక భయంకర వ్యాఘ్రంబు బొబ్బలిడుచు వారున్న వైపునకు దుముకుచు వచ్చుచుండెను. దానింజూచి యా పురుషవరేణ్యుండు నే నిదే యీ ఘాతుకమృగంబును సంహరించి క్షణములో వచ్చెద నిందే యుండుమని పలు కుచు చంద్రహాసమును ఝళిపించుచు యా వ్యాఘ్రమున కెదురుగా నరిగి దానిం దరుముకొనిపోయెను.

ఇంతలో దాపుననుండి వారి సంభాషణ మాలింపుచున్న యా యక్ష కుమారు లిరువురు నిదియె యదనని విమానము దిగివచ్చి యచ్చపలాక్షిని బలిమిమై బట్టి తమవ్యోమయానంబునం బెట్టికొని యంతరిక్షంబున కెగసిపోయిరి. వ్యాఘ్రమును సంహరింపఁబోయిన పురుషునకుఁ హా! మనోహరా! రక్షింపుము. రక్షింపుము. వీండ్రెవ్వరో బలవంతమున నన్ను విమానమెక్కించి ఫైకిఁదీసికొని పోవుచున్నారు. అను నబలారోదనధ్వని వినంబడినదేకాని యాదివ్యయానం బేవంకకుఁ బోయినదో వానికి గోచరము కాలేదు. వ్యాఘ్ర సంహార మొనర్ప నతఁడెంత ప్రయత్నించినను నది కొనసాగినదికాదు. చంద్రహాసమున దాని దేహమును దుత్తునియలుగా నరికినను నది చావదయ్యెను చివురకతండు విసుగుఁజెంది మహోద్రేకంబున దానిం గవిసి తచ్చిరంబూడిపడునట్లు నిజకుఠారధారచే గట్టిగాఁ గొట్టెను. ఆ వ్యాఘ్రశిరంబు బంతి వలె పైకెగిరి తిరుగ నిముసములోవచ్చి యా కళేబరంబున కతుకుకొనుటయును పులి యొక్క. యురుకున నదృశ్యమగుటయు నొక్కసారి జరిగెను. ఆ పురుష పుంగవుండా యద్భుత దృశ్యమునకు వెఱగందుచు శార్దూలము శరవేగంబున దూరముగా బారి పోయిన కతంబున దాని వెంటాడించుట యనవసరమని తలంచి యతండు తిరుగ నా భామినీరత్నమున్న చోటి కతిరయంబున నేతెంచెను. కాని వాని కాప్రదేశమంతయును శూన్యమై గనంబడెను. అక్కాంతాలలామ నంతలో నెడఁయాయటకుఁ జింతించుచుఁ దన్మృదు మధుర వాక్యంబుల నెన్నుచుఁ దదీయరూపలావణ్యాదుల దలపోయుచు