పుట:కాశీమజిలీకథలు-12.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనంగమోహిని కథ

19

రత్నంబులఁ దిరస్కరించుచుండెను. చక్కదనంబునకెల్ల నానాగకన్యకారూపము పరమావధియని, చెప్పిన నామెయవయవసౌష్ఠవంబిట్టిదని వర్ణింప నగత్యముండదు. ఆమె యసామాన్యసౌందర్యవైభవంబు నాగలోకంబుననేగాక చతుర్దశభువనముల యందలి యౌవనపురుషులకు హృదయాకర్షకంబై యుండెను.

ఆ మోహనాంగిఁ జేపట్ట దేవతలుఁ గూడ నుత్సుకతం బొందుచుండిరి. కాని మధ్యనున్న భూలోకమునుదాటి నాగలోకమునకేగుటకు దివోదాసుని శాసన మనతి క్రమణీయమై యడ్డువచ్చెను. దానంజేసి యార్ద్వలోకలములవారికి‌ నధోలోకములవారికిని రాకపోకలు లేకపోయినవి. పాతాళంబున నున్న పురుషుల నందఱఁ ద్రోసిరాజని యారాజాస్యలోకాంతరస్థానురూప ప్రియసమాగమాకాంక్షఁ బ్రొద్దుపుచ్చుచున్నది.

ఒకనాఁడబ్బిట్చోకవతి యుచితసఖీజనంబుతోఁ బ్రాంతకేళికోద్యానమునందు విలాసవిహారమొనరించునప్పుడు తరినెరింగి యొక రక్కసుం డెక్కడనుండియో రయంబున నక్క డకువచ్చి యచ్చపలాక్షి నెత్తుకొని పారిపోయెను. ఆవార్త చెలికత్తియల వలనవిని వాసుకి శోకమూర్చితుండై యాప్తుల యనునయవాక్యంబుల దెప్పిరిలి తనూ జాతాన్వేషణంబునకై యపరి మిత సేవక సమూహంబును నతల వితల రసాతల తలా తల పాతాళాది వివిధాధోలోకంబులకుఁ బంపెను. కారి యాకోక స్తని యునికి యెచ్చటను గనుపింపదయ్యెను. ఊర్థ్వలోకంబులకేగి యందన్వేషించుటకు దివోదాసుని శాసనము బెనుగొండవలె నడ్డుదవులుచున్నది. మనుజలోకంబునకు నాగలోకవాసులు బోరాదు గదా? అది దాటినఁగాని దివిజలోకంబుల కరుగుటకెట్లు వీలగును. ఒకవంక పుత్రికా వియోగశోకం బొకవైపు మర్త్యలోక ప్రవేశాభ్యంతర‌ ప్రకటితావిలంఘ్యశాసనభయం బొకమూల దారుణావమానజనితచింతాసముజ్యల జ్వాలాభీల కీలావిలోల హృదయ తాపం బిట్లు వాసుకి శోకభయవిహ్వలవేదనా దోదూయమాన మానసుండై కర్తవ్య వక్తవ్యంబు లెఱుంగక కులము పెద్దయగు నాదిశేషునియొద్దకరిగి యక్కథనెరింగించి తనతనూజాతను రక్షించుటకుపాయము జెప్పుమని మిక్కిలి దీనుఁడై ప్రార్దించెను.

అయ్యుదంతంబువిని శేషాహి నిజసహస్రఫణామండితమణీఘృణులు దెసలవ్యాపింప శిరఃకంపమొనర్చుచు నేమేమీ ! మ్రుక్కడి రక్కసుండొక్కరుండుక్కు మిగిలి నాగకన్యాలలామను బలవంతముగా నెత్తుకొనిపోయెనా ? ఔరా ! ఎంతనిర్భయ ప్రవర్తనము ! వాఁడత్తలోదరినిఁదప్పక మనుజలోకంబునకే కొనిపోయియుండును. శాసనభయంబున నందురుగవాసులు చేరరాదుగదాయని యట్లొనరించియుండును. ఇందులకు తగిన ప్రతీకార మతిశీఘ్రముగాఁ జేయకున్న వానివలన నాకన్యక కేమికీడు మూడునోగదా? ఈ వృత్తాంత మంతయును నిచ్చట నివసించియున్న బలిచక్రవర్తికిని వాని తలవాకిలిఁ గాచియుండు గరుడవాహనునకు నెరింగించి వారియాదేశమువడువున ప్రవర్తింతము రమ్మని చెప్పుచు వానిని వెంటఁబెట్టుకొని బలిదైత్యేంద్రు నివాసంబున కరిగెను.