పుట:కాశీమజిలీకథలు-12.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

మీ కిచ్చెదంగాక. మా రాజ్యంబున నిట్టి యక్రమంబు జరుగ నే సహింపఁజాలను అని నుడువుచు మరియు నిట్లనియె.

ఓరీ ! ఆ పాపపు చిలువ బాలునింగరచి యెందేగెనో చూచితిరా యని యడుగుటయు వారు చేతులు మోడ్చుచు నదుగో యెదురం గనంబడు పుట్టకలుగు లోనికిఁ బోవుచుండ మేము గన్నులారం జూచితిమని చెప్పిరి. అప్పుడే రాజు తద్వల్మీ కంబును ద్రవ్వించిచూడ నందొక మహాతపస్వి యత్యద్భుతతేజోదుర్నిరీక్షుండై నిమీలితాక్షుండై సిద్ధాసనంబున నిర్వికల్పక సమాధి నిష్టాగరిష్టుఁడై చూపట్టెను. వానింజూచి యెల్లరు విస్మయసాధ్వసములం బొందిరి. ఆ పుడమిఱేఁడు వేడుకగా నా జడదారింజూచుచు చిడిముడి పాటించుకయును లేక వాని యడుగులంబడి నమస్కరించు వాఁడువలె క్రిందకువంగి చేతులు సాచి తత్పదద్వయంబు గ్రహించి మించిన తమ కంబున బిఱబిఱముందునకీడ్చుచు మ్రుచ్చా ! నీ మాయావేషంబు లిఁకజాలింపుమని పలుకుచు మహాక్రోధంబునఁ దచ్చిరంబునేలంబెట్టికొట్టెను. తోడనే యా జటిలుని రూపంబంతర్ధానమై కన్నులకు మిరుమిట్లు గొలుపు నత్యద్భుత తేజంబొండు వెల్వడి నిమిసములో నదృశ్యమయ్యెను.

అమ్మహారాజు వెఱపించుకయుం బొందక నలుమూలలం బరికింపుచుండ నంబరంబున నొకవింతళకుంతంబు గోచరమయ్యెను. దానినుపలక్షించి యాక్షితీశ్వ రుండు పోకుపోకుమని యదలించుచుఁ జంద్రహాసంబు గైకొని యోగమార్గంబునఁ బై కెగసి దానిం దరుముకొనిపోయెను. క్రిందనున్నవారు వానికొఱ కాదివసాంతము వఱకు నిరీక్షించి యుండిరిగాని వానిజాడ యేమియుఁ బొడకట్టనందునఁ బ్రక్కనున్న తమపల్లెకుంబోయిరి. రాజ సేవకులును మరకొన్నిదినంబులందుండి యొడయని వర్త మాన మేమియుం దెలియనందున నిరువుర మాత్రమందుగాపుంచి తక్కినవారెల్ల వారణాసికింబోయి ప్రధానుల కావృత్తాంతమంతయు‌ నివేదించిరి. రాజుగారిక్షేమ మరయఁ బెక్కండ్ర దూతల వివిధప్రాంతములకుఁ బంపించి మంత్రులు రాచకార్యము లన్నియును దివోదాసునిపేరున నిర్వర్తించుచుండిరి.

303వ మజిలీ

అనంగమోహిని కథ

నాగలోకంబున నొకభాగమునకు నాయకుండై వాసుకియను సర్పశ్రేష్ఠుండు పరిపాలించుచుండెను. అతనికి అనంగమోహిని యను పుత్రికారత్నంబుగలదు. అబ్బాలిక చూళికాభరణ రూపలావణ్యాతి శయంబుల ముల్లోకములఁగల సీమంతినీ