పుట:కాశీమజిలీకథలు-12.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

నవి. కర్షకుల కనంతయనంత ఫలంబొసఁగుచుండెను. పశువులకు స్వేచ్చగా కసవు లభించుటంజేసి ప్రజల కమృతముగురియుచుండెను. సంతృప్తి సంతోషసౌఖ్యములు బ్రతియింటను దాండవమాడుచుండెను ఇట్లు తృణకాష్టజలసమృద్ధిఁగలిగి గ్రాసవాసో వైభవంబుల కింతయుఁ గొరంతలేకుండ భూప్రజలు దివోదాసుని రాజ్యంబునఁ జెలంగి యుండిరి.


క. చాతుర్వర్ణ్యములోనరఁగ
   ఖ్యాతింజతురాశ్రమార్హ, ఘనధర్యోద్య
   ద్రీతులఁ దప్పక తమతమ
   నీతంబుల మెలఁగుచుండె నిత్యము బ్రీతిన్‌.

మరియును జారచోర క్షామనృపాగ్ని రుకావగ్రహాపమృత్యుభయంబులు దివోదాసుని రాజ్యమునం దెందునులేక ప్రజలకు శ్రీరామ రాజ్యంబువోలె నొప్పి యుండెను. భూసురులు భాసురవేదాధ్యయన సంపన్నులై రాజు నా నతిన దేవతా కంబులుగ నధ్వరంబు లనేకంబు లొనర్చుచు రాజునకు రాష్ట్రమునకు. ననవరతశుభో దర్కం బొదవునట్లు మెలఁగుచుండిరి. రాజులు, రాజులై నిజబలప్రతాపజ్యోత్స్నా సముదయంబులు దుర్జనహృదయనాళీకవిద్వేషణంబులుగా సజ్జనచకోర హృదయాహ్లాద కరంబుగాఁ జరించుచుండిరి. బేరులు కుబేరుని బేరుతోనే ధిక్కరించుచు ధనకనక వస్తు వాహనసంపన్నులై యర్ధిజనకల్పకంబులై డుంబుమీనియుండిరి. కృషికు లార్య సేవా తృషితులై పుడమి ముక్కారుపంటలం బండించుచు సర్వజీవ ప్రమోదకారణులై చెలఁగియుండిరి.

ఇట్లు ప్రజారంజకుండై ధర్మంబు నాలుగుపాదంబుల వర్తించుచుండ ధరణీ చక్రంబవక్రవిక్రమంబున దివోదాసుండు పరిపాలించుచు నొక్కనాఁడు పేరోల గ౦బున నున్న సమయంబునఁ గొందరు వనాటులరుదెంచి తాము తెచ్చిన వన్యవస్తు సందోహంబులఁ గానుకలుగా నా పరివృడుని మ్రోలంబెట్టి జోహారు లొనరించుచు నిట్లు విన్నవించుకొనిరి.

ఏలికా ! మేము వింధ్యారణ్యవాసులము. ఏలినవారి దాసులము. దేవర పరిపాలనంబున నెందును బన్నగ బాధలేకుండ నా జాతినంతయును బాతాళంబునకుఁ ద్రోయుటంజేసి యరణ్యజీవనులమైన మేము కటికి చీశకటియందైనన పురుగు బాధ నెరుంగక నిర్భయముగా దిరుగుచుంటిమి. కాని మొన్న మా పిన్నిగారి కన్నగాఁ డొకఁడు కట్టెలకై మిత్రులతో దూరముగానున్న మెట్టదరకేగి యందొక మూల నున్న పెద్దపుట్టలో నొక నాగుబాముం జూచెనఁట. వాఁఢూరకొనక యా పుట్ట నతి క్రమంబునం ద్రవ్వి యందు జుట్టఁ జుట్టుకొని యున్న యా పన్నగమును గ్రన్నన తనయొద్దనున్న గొడ్డలితోఁ జావఁగొట్టెను. పిమ్మటనది చచ్చినదని నిశ్చయించి యా