పుట:కాశీమజిలీకథలు-12.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దివోదాసుని కథ

15

సింహాచల, పట్టసాచల, భద్రాచల, వేంకటాచల శ్రీశైల శ్రీకూర్మ శ్రీరంగ కుంభకోణ కంచి కాళహస్తి‌ రామేశ్వరాది దివ్యస్థలంబుల నధివసించియున్న సకలదేవతా సమూ హంబును కుటుంబ పరివార సమేతంబుగా వెడలివచ్చి విశ్వేశ్వరాదేశంబున నెందేనిఁ బోవువారై యమ్మహాదేవునిఁ గాశియందుఁ దర్శించిరి. ఆ దేవోత్తముండునుఁ దనకింక వారణాశీ నివాసయోగ్యత లేదనియెంచి తన్గూర్చి తొల్లి తద్దయుం బెద్దతపంబుజేసిన మందరాచల శిఖరప్రదేశంబున నుండుటకు‌ నిశ్చయించి వచ్చిన వేలుపుల మూకల కెఱింగించి నందీశ్వర ఛండీశ్వర భృంగీశ్వరాదులు దన్నుఁ బరివేష్టించియుండఁ బ్రథమగణంబులతో నంబికాసహితుఁడై యందుఁ గదలెను. ఇట్లు సమూహంబుతో విశ్వ నాధుం డయ్యవిముక్త క్షేత్రంబువిడిచి.


సీ. లవణ పాథోధివేలా వేష్టితంబైన
           యల్లొ నేరెడుదీవి యతికరించి
    యిక్షురసాబ్ది పరీతాంచలంబైన
           ప్లంక్షాంఘ్రివద్వీప పరిధిఁగడచి
    హాలారసోదన్వదభి ముద్రితంబైన
           శాల్మల ద్వీప భూస్థలముఁదాటి
    ఘృతపయోరాశి సంక్లిప్తావధికమైన
           చంచత్కుశద్వీప జగతిఁ జేరి.

గీ. అమ్మహాద్వీపమునకు రత్నాఢ్యమైన
   మకుటమునుబోలె నొప్పారు మందరమునఁ
   గనక కలధౌత మాణిక్య కందరమునఁ
   గాపురముసేసె శివుఁడంబికయునుఁ దాను.

దివోదాసుని శాసనభయంబున సరినృపకులంబెల్ల భూభాగంబున నుండఁ జాలక యధోలోకంబున కేగవలసివచ్చినది పుట్టలలో, గుట్టలలో, దొరువులలో, డొంక లలో పురవనతరుశైలంబుల మూలమూలలనున్న కాద్రవేయసమవాయంబు సమధిక వేగంబున నొండొరుల బిలిచికొనుచు, పడగల మొగిడ్చుచు, పుచ్చంబులప్పళించుచుఁ జుట్టలు జుట్టుకొని తండోపతండంబులుగా భూవివరంబుల మూలంబున రసాతలంబునం బడీ తమపాటు వాసుకిప్రముఖనిఖిలవాతాళన శ్రేష్టులకెఱింగించుకొనునవి. ధరణీతలం బున నురగులజాతులు శూన్యంబగుటచే జంతుజాలంబు నందపమృత్యుభయంబు గొంత వఱకుఁ దగ్గినది.

దివోదాసుండును నాత్మీయబలప్రభావంబులఁ బర్థిన్యునివర్షించునటుల శాసించుటయుఁ నతండుక్రమంబున సర్వసన్యానుకూలముగా భూలోకంబున వర్షించు చుండెను. దానంజేసి నదనదీకేదారవాపీకూప తటాకంబులు జలసమృద్ధికలిగి యొప్పి