పుట:కాశీమజిలీకథలు-11.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(3)

కాళిదాసకవి భోక్తృత్వము

17

రము జెప్ఫినది. ఆ మాటవిని యా పాఱుడు దిగులుపడి అయ్యో ! నేడు నేను గంగలో దిగిన బాగుండెడిది ఇది యెక్కడి భోక్తృత్వము. నా కర్మము కాల ! నే నిందుల కేమిటి కనుమతింపవలయును ? అతనికి నా మాట జ్ఞాపకమున్నదో లేదో? ఎప్పుడు లేచునో తెలియదు. అంతదనుక నే నిందుబడియుండవలసినదే ? అక్కటా ! జ్ఞానతీర్థా ! నాకు మంచి ప్రాయశ్చిత్తము జేసితివి. ఊరిలోనివారెల్ల నవ్వ నిన్నీవిటుని భోక్త‌గా నియమింపుమని నియోగింతువా ? తెలిసినది. యోగులు కర్మత్యాగులు నా కర్మఠత్వము భ్రష్టముచేయు తలంపుతో నిట్లు జెప్పితివి. తెలిసి కొనలేక బోయితిని.

అని యూరక పశ్చాత్తాపము జెందుచు లోపల నేదియో గొణిగి కొను చున్న యాజన్నికట్టు వెట్టనిట్టూర్పు గనిపెట్టి చేతిపనిమాని వేగమ మేడపైకేగి దాది విలాసవతి కిట్లనియె.

అమ్మా ! ఎవ్వడో బాపనయ్య అయ్యగారితో బనియుండివచ్చి మన వీధి యరగుపై గూర్చుండెను. వారు ప్రొద్దెక్కుదనుక లేవరని చెప్పిన పరితపించెను. పాప‌ మేమిపనియో వీరిని లేపెదవే యని చెప్పిన నొప్పుకొని యప్పడతి యప్పండిత నుండుమని‌ బ్రబోధించి యవ్వార్త దెలిపినది. అతండు కన్నుల నులిమికొనుచు లేచి మేడదిగి వాకిట వేదికపై నిలిచి నోటి తాంబూలపుతమ్మ తుబుక్కున నుమిసి యా బాడబుని జూచి మీరా ? మీ యింట నాబ్దికము నేడా? యని యడిగిన నావిప్రుండు చిత్తము నేడే ! మిమ్ము భోక్తగా నిమంత్రించితిని. నా కోరిక మరియొకటి విన వలయును. ఇక‌ మఱేమియు దినవలదని ప్రార్థించుచుంటి. మా యింటికి గుతప కాలంబునకు దయచేయుడు అని చెప్పిన నతండు నవ్వుచు వల్లెయని మరలి యింటి లోకిం బోయెను.

అగ్నిశిఖుం డింటికిం బోవుచు ఆహా ! విధి పురుషు నప్రయత్నముగనే యధోగతిం దొరయజేయును. ఊరిలోనున్న శ్రోత్రియులనెల్ల నుల్లంఘించి యుత్తమభోక్తలకై, ప్రయత్నముసేయ చివరకధమాధముడు లభించెను. వీడు విప్ర పంక్తిని గూర్చుండుటకైన నర్హుడుగాదు. ఎక్కడి విలాసవతి ? ఎక్కడి కాళిదాసు? ఎక్కడి భోక్త! నాచే నిట్టిపని యెరింగియున్నను భగవంతుడే చేయించుచున్నవాడు. ఎందులకు మనుష్యుడు స్వతంత్రుడు కాడని దీనందెల్ల మగుచున్నయది వాని పుణ్యము. స్నానమైన జేయుదునని యొప్పుకొనియెను. పదిబిందెలనీళ్ళు కాచి యుంచవలెనట. వాని మేని మురికియంతయు మా పెరటిలో విడుచును గాబోలు. ఇది యుంగొంత మేలే యని దలంచుచు నింటికి బోయెను.

అప్పటికి రెండుయామములైనది. అతనివంట పూర్తిజేసి భర్తంజూచి బోక్తల నిమంత్రించితిని ? మీ మనస్సునకు సరిపడినవారు దొరకిరా ? యని యద లించినవాడు మొగము చిట్లించుకొనుచు, ఆ - దొరకిరి. మీ యందరి పోరే నాకు