Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

అప్పుడు పింగళిక యీతఁ డొకమార్గస్తుఁడు. దారితప్పి మనయింటి కతిధిగా వచ్చెను. పేరడగినం దప్పా ? చెప్పుము చెప్పుము. అని సంజ్ఞచేసిన నాబాలుఁడు అయ్యా ! నా పేరు సత్యవంతుఁడు. అని పలికెనుఁ బాపురే ! కుమార మంచిపేరు పెట్టుకొంటివి. అందులకుఁ దగిన వాఁడ వగుదువు. అని మెచ్చుచ్చు వయస్యా ! నీ వేమైనం జదివితివా ! యని యడిగిన నమాట వాని కర్ధముకాక దిక్కులు సూచుచు నదియేమని మరల నడిగెను.

భుజింపుము. పిమ్మట నతైరం గే నెరింగించెదనని పలికిన నా బాలుండు తృటికాలంబులోఁ గుడిచి యతనివద్దకువచ్చి అయ్యా ! అది యేదియో చెప్పెద నంటివి. చెప్పెదవాయని యడిగిన మకరాంకుడు విద్యావిషయమైన పద్ధతు లన్నియుం జెప్పి దానియందు వాని కాసక్తి గలుగునట్లుఁ జేసెను.

అది మొదలు సత్వవంతుఁడు తనకావిద్య చెప్పుమని మకరాంకుని నిర్బంధింప దొడంగెను. మకరాంకుఁడు తొలుత నక్షరములు గుణితము పేరులు లోనగు పద్ధతు లన్నియు వ్రాసి యిచ్చుటయు సత్వవంతుఁ డవియన్నియు నొకసారి వినియే గ్రహించెను. మకరాంకుఁ డారీతి ప్రతిదినము చెప్పుచు నొక సంవత్సరము నాటికిఁ దనకు వచ్చిన విద్యయంతయు నేరిపి సత్వవంతు నధికవిద్యాపరిపూర్ణుం జేసెను. స్వల్పకాలములో ననవద్యమగు విద్యసంగ్రహించి యొకనాఁడు శబరకుమారుండు మకరాంకుఁడు వినుచుండ తల్లితండ్రుల కిట్ల నియె.

ధాత్రీతలంబున నెన్ని యేనిఁ జిత్రంబులు గలిగియున్నవి. మనము విద్యా విహీనుల మగుటఁ బశుప్రాయులమై యీ మహారణ్యంబునఁబడి యున్నవారము. మనుష్యులందరు నేకజాతివారైనను సేవ సేవక న్యాయంబులు బుద్ధిబలము ననుసరించి గలుగుచున్నవి. అందులకు విద్యయే మూలకారణము. విద్యలేనివాఁడు కన్నులున్నను గుడ్డివాఁడేసుడీ ? ఈ మహాత్ముని కృపావిశేషమున నేను సకల విద్యా మర్మంబులం దెలిసికొంటి. మనమిఁక విందుండ నవసరములేదు. జనపదంబుల కరుగుదము రండు మదీయ విద్యాబుద్ధి బల విశేషంబుల మిమ్ము రాజతుల్యులం గావింతునని పలికిన విని నవ్వుచు శబరదంపతు లిట్లనిరి.

అబ్బా ? ఆపాడుపట్టణము లొకసారి పోయి చూచితిమి డొంకయుఁ జా టును మాటును లేవుగదా? పెద్ద పెద్దమిద్దెలంట. వాకిట నిలువఁబడనీయరు. పొండు పొండని పలుకుచుందురు. అవి మనకొండలకన్న పెద్దవియాయేమి ? ఎక్కడజూచినను మేకల తెగలపోలిక నరులే తిరుగుచుందురు. అంతకన్న నరకమే మేలు. చీకాకులేని యీ యడవియే స్వర్గమని పలికిన నవ్వుచుఁ బోనిండు. నే నొకసారిఁ జూచివచ్చెద ననుజ్ఞ యిండని వేడుకొనుటయు నెట్టకేని వా రంగీకరించి మకరాంకున కప్పగించి నగరముఁ జూపించి వెండియుఁ దీసికొనిరమ్మని చెప్పిరి.

మకరాంకుఁడు పరమ సంతోషముతో నందుల కియ్యకొనినాఁడే పయన