సత్వవంతుని కథ
101
అని పలుకుచు నాకొక కుమారుఁడు గలఁడు. వాఁడింతకుముందే యడవికిఁబోయి యున్నవాఁడు ; వచ్చువేళయైనదని చెప్పుచుండగనే యా భిల్లకుమారుం డొక శార్దూలశాబకమును వింటికొనకు దగిలించుకొని యింటికివచ్చెను.
వానింజూచి పింగళిక నాయనా ఈ బాల శార్దూలము నేమిటికిఁ జంపితివి? దీనికొరకు దల్లి యెంత పరితపించుచుండునోకదా ! మృగంబులం జంపునెడ నానుడివిన మాటలను మరచితివా ? అని యడిగిన నా బాలుండు అమ్మా ! నీమాటలే నేమిటికి మరచువాఁడ. విను మీ వ్యాఘ్రడింభకంబు తల్లి తో విడిపోయి యేకతమ తిరుగుచు నా కడ్డము వచ్చినది. అప్పుడిది నిసువని తలంచి దానిజోలికిబోక నేను వేరొక తెరవునఁ దప్పించుకొని పోఁదలంచితిని. ఈ పులిపిల్ల నన్ను విడువక మీదికి లంఘించి పరాక్రమముఁ జూపుటయు నేను చంపక పెద్దతడుపు పారఁదోల వలయునని యదలించితిని. నా యదపులు లక్ష్యము సేయక మీదికురికినది. అప్పుడు ప్రాణసంకటముగాఁ దోచిన వింటికొన వ్రేటున దీనిం గడతేర్చితిని తప్పా ! చెప్పుము అని చెప్పిన నా యిల్లాలు తండ్రీ ! తప్పులేదు. ప్రాణసంకటమైనప్పు డెట్టి దానినైనఁ జంపవచ్చును. రమ్ము. రమ్ము. జలక మాడుము. కుడువుము ప్రొద్దుపోయినదని పలకినది. అప్పు డా సంవాదమంతయు విని మకరాంకుండు.
శా. తారాచంద్ర సముజ్వల న్ముఖముతోఁ బ్రాంచల్ల లాటంబుతో
నాకర్ణాంత విశాలనేత్రములతో నాజానుబాహాయుగ
శ్రీకమ్రాంగముతో మనోహర రధశ్రేణి న్విరాజిల్లు మూ
రాకారున్ శబరీకుమారుఁ గని యోహాక్రాంత చిత్తంబుతో.
ఔరా ! వింతలపై వింతలు గనంబడుచున్నవి. ఇమ్మహారణ్య మధ్యమునఁ బచ్చిమాంసము భక్షించెడి కిరాతకములో నిట్టిగుణవంతు లుండుటయే యాశ్చర్యము. ఉండెఁబో. ఇట్టివారికి నిట్టి యద్భుతరూప సంపన్నుండైన కొమరుఁ డుదయించుట మిక్కిలి యబ్బురముఁ గలుగుచున్నది. ఆహా ! విధివిలసితములు వినిమయోపగతములుగదా ! అయ్యో ! పరమేష్టి యిక్కుమారశేఖరుని సార్వభౌముని యింటఁ బుట్టింపక యిట్టి నికృష్టజాతియందుఁ బుట్టించునా. అన్నన్నా ! ఈపిన్నవాఁడు పాదచారియై యీ కుటీరములో సంచరింపఁ దగినవాఁడా ! ఇట్టి సుందరుని గని విని యెరుంగనుగదా! ఏమిచిత్ర మేమిచిత్రముఁ మదీయ దేశాటనోద్యమ మిప్పటికి సాద్గుణ్యము నొందినది. కన్నులు గలిగి నందులకు ఫల మనుభవించితిని వీని రూపమున కనురూపములైన గుణములు గలిగియున్నవి. కాని వీఁడు విద్యాగంధరహితుండని తోచుచున్నది. పరీక్షించి చూచెదంగాక యని తలంచుచు మకరాంకుఁడు, మిత్రమా ! యిటురా ! నీ పేరేమని యడుగుటయు నతండు నవ్వుమోముతోఁ దల్లివంకజూచి అమ్మా ! యీతడు యెవ్వరు ? నన్నుఁబేరేమని యడుగుచున్నాఁడు. ఏమని చెప్పవలయు నని యడిగెను.