100
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
మృగప్రాయులై యున్నారు. అయ్యారే ! ఈ శబరపురంధ్రులు నాగరికత యెరుఁగకున్నను స్వభావ సుందరులగుట దర్శనీయలై యుండిరి. ఈ పల్లె వెదురు తడకలచే నల్లబడిన గుడిసెలు కలదైనను నందుగల వస్తువిశేషములచే మనోహరమై యున్నది. అని తలంచుచు గాసరునివెంట వానియింటి కరిగెను
సీ. తోలుమూసిన మంచి తుంబీఫలంబులు పైడి గంగాళముల్పగిదిగ్రాల
పునుగుజవ్వాది కప్పురముగస్తురి గమగమలాడు వెదురుగొట్టములనొప్పి
గురువిందపూసలు గూర్చిగట్టిన మంచిముతైపు తోరణంబులఁజెలంగి
పరచిన రత్నకంబళులట్ల బహుచిత్రమృగకృత్తులెదల భ్రమింపజేయ.
గీ. చాయలీనెడు నెమలిపించములు గలిగి
ధవళచామర చయధగద్ధగిత మగుచు
మురువుఁగాంచెడు రాజమందిరముపగిదిఁ
గరము దనరారు నాభిల్ల వరునిగృహము.
మకరాంకుఁ డందలి విశేషంబులం జూచుచు నిలువంబడినంత గాసరుఁడు గుడిసెయొద్ధకరిగి పింగళికా ! యిటురా యని పిలిచినంత వానిభార్య తడకఁదెఱచికొని వాకిటకువచ్చి మగనికి నమస్కరించుచు మకరాంకునిజూచి యీతఁ డెవ్వండని యడిగిన వాఁడిట్ల నియె.
ఈతఁడొక బాటసారి. అడవినడుమ వ్రేటు తినినపోత్రిచే నడపబడి యాత్రముఁ జెందియున్నవాడు. దప్పిఁదీర్చి యిచ్చటికిఁ దీసికొనివచ్చితిని. పాప మాకలి యగుచున్నది. తడవుసేయక వేగమ వెదురు బియ్యము వండుము. కుడువఁ గలఁడని నుడువుటయు నప్పడతి కులుకుచుఁ దృటిలో వంటఁజేసి కుడవ రమ్మని పిలిచినది.
ఆ చెంచతగావించు నుపచారముల కలరుచు మకరాంకు డౌరా ? కృప యెట్టిదో యెరుంగని యెరుకవంగడములో నుదయించిన మీ దంపతుల కీ గృహస్థ ధర్మంబు లెట్ల లవడినవో తెలియదు. మృగతూల్యయైన పింగళిక పతిభక్తియు నతిధిభక్తియు నెవ్వరియొద్ద నేర్చుకొన్నదో విచారణీయమై యున్నది. అని యాశ్చర్య మందుచు బింగళికచే వడ్డింపఁబడిన యన్నము తేనెపండ్లులోనగు పదార్ధములు భుజించి తృప్తుండై పింగళిక కిట్లనియె.
సాధ్వీమణీ ! నీవు శాపోపహతవై యిక్కులంబులఁ బుట్టితివని తోచుచున్నది. కాక శ్రీరామునకు ఫలంబులనిచ్చి యాకలి యడంచిన యా శబరివైనం గావలయును. సామాన్య బిల్ల పల్లవాధరి కీ యౌధార్య మెట్లుగలుగును ! నీ చేతి యన్నంబుఁదిని నేను ధన్యుఁడనైతినని పొగడుచు నీకు సంతానమున్నదియా యని యడిగిన నా యిల్లాలు అప్పా ! మమ్మొక గొప్పఁజేసి పొగడుచుంటివా ? చాలుచాలు మాకును మృగములకును నించుకయు భేదము లేదు. మేము స్తుతి పాత్రులముగాము.