98
కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము
శశాంకుఁడు మిక్కిలి దుఃఖింపుచు నతని కపర సంస్కారములు నిర్వర్తించి యనంతరము మంత్రి సామంత పురోహితాదులచే నిమంత్రితుండై పట్టాభిషిక్తుండయ్యెను. అతండట్లు రాజ్యభారము మీదవైచికొని లోపములు సవరించుచు చట్టములు నిర్మించుచు దుర్జనుల శిక్షించుచు సుజనులను రక్షించుచు చిరకాలములో నధిక విఖ్యాతి సంపాదించెను.
కొంతకాల మరిగినవెనుకు కిన్నరదత్తునిభార్య శశాంకునొద్ద కొకలేఖ నంపినది. వత్సా ! శశాంకా ! నీవు శశాంకునిపగిది ప్రజలకుఁ జల్లనివాఁడవై రాజ్యంబేలుచు మీ తండ్రికీర్తి వర్ధిల్లజేసితివి. ఇందుకు బ్రకృతివర్గము చాలా సంతోషించుచున్నది. అది యటుండె నాయన్న కూఁతురు తారావళినిఁ దల్లి లేనిదానిని జిన్నతనమునుండి నేను పోషించి పెద్దదానిం జేసితిని. దాని చారిత్రము నీవదివరకు వినియే యున్నావు. వృద్ధరాజు అది నీ పట్టమహిషియని చెప్పియే యున్నాడు. ఇప్పడా చిన్నది సమారూఢయౌవనయై యున్నది. కావునఁ బెండ్లియాడి గృహస్థు డిపుఁగమ్ము. నేను మిగుల సంతసించెదనని తల్లివ్రాసిన కమ్మను గన్నుల కద్దికొని శశాంకుఁడు తనపూర్వోదంత మంతయు నంతఃకరణ గోచరమగుటయు నప్పుడామెకు సమాధానముగాఁ బ్రతిలేఖనంపి యాత్మగతంబున నిట్లు తలంచె
ఆహా ! రాజ్యమదాంధులు తమ్ముఁ దామే యెరుఁగనిచో నొరులనెట్లు తెలిసికొనఁ జాలుదురు. ఆఁడుదానను మగరూపున రాజ్యం బేలుచున్నదాన ననుమాటయే మరచిపోయితిని. ఔరా ! ఎంతచిత్రము. రాజ్యభోగ వ్యసన మెట్టి మైకము కలుగఁజేసినది? అయ్యో ? యిప్పుడుపోయి వయస్యలఁ గలసికొందమన్నను నీ రాజ్యము నాకుఁ బాదగళమైనదిగదా. కానిమ్ము. వారినిచ్చటికి వచ్చునట్లు చేసెదనని యాలోచించి యొక పత్రికయం దీ పద్యము వ్రాయించెను.
ఆ. వె. పిన్నపాపనలనఁ గన్నెలు మువ్వురు
గలిగి రట్టివారు కన్మొఱంగి
దెసలఁ గొసలఁ దెలియఁ దిరుగుచు నున్నారు
వారిజాడఁ దెలియవలయు మాకు.
అని వ్రాయించి కింకరులకిచ్చి మీరు దేశదేశముల దిరుగుచు నీ పద్యముఁ జదువునది. దీనికి సానుభవముగాఁ బ్రత్యుత్తర మిచ్చినవారి సబపఱమానముగా నా యొద్దకుఁ దీసికొనిరండని యాజ్ఞాపించి పంపించి తా నంతఃపురమునకుఁ బోయెను. అని యెరింగించి మణిసిద్ధుం డవ్వలికథ తరువాతి యవసధంబునఁ జెప్పం దొడంగెను.