పుట:కాశీమజిలీకథలు-06.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

నిండింపబడిన చర్మభస్త్రికల బంగారు బొమ్మలని పొగడుచు తత్సంగాదులకు లేనిపోని కల్పనలను జేయుచున్నారు. అది నామది కెక్కదు. వినుము.

ఉ. ఆయువు వీచిచంచలము, యౌవన ముల్పదినోచింతంబు పు
    ష్పాయుధకేళిజన్యసుఖ మస్థిర, మర్దము వాంచవోలె సా
    పాయము, భోగము ల్మెఱుపులట్ల భరాబ్ధిలంఘనో
    పాయము బహృచింతనము బాయక సేయుఁడు సజనోత్తముల్.

అని మనము చదివిన పద్యము జ్ఞాపకము చేసికొనుము.

మహే - మేలు మేలు. నీ వాచాలత శోచనీయమైయున్నది. ఇప్పుడే నీ కీ వేదాంతప్రసంగ మేమిటికి?

స్వయం —— సఖీ ! నీతో నిక్కము వక్కాణించెద వినుము. ఆ స్వయంప్రభవలె దివ్యాశ్రమ మొండు కల్పించుకొని యోగినీవేషముతో తపముఁ జేసికొనుచుండవలెనని నాకు మిక్కిలి యభిలాష యున్నది సుమీ ?

హేమ - బాగుబాగు సఖీ ! ఇందులకా నీ వెల్లప్పుడు నాసుందరిచరిత్రమునే చదువుచుందువు? ఇసిరో ! నీకిట్టివృద్దుల యభిలాషగలిగిన దేమి.

స్వయం -- ఏమెయో చెప్పజాలను. నా కామిత మీడేరునా ?

అని వారు సంభాషించుకొనుచున్న సమయంబున నొక పరిచారిక వచ్చి భర్తృదారికా ! అయ్యగారును అమ్మగారును వచ్చి తోఁటలోని క్రీడాసౌధంబున వసియించి యున్నవారు. మిమ్ము వడిగాఁ దీసికొనిరమ్మని సెలవిచ్చి రనుటయు రాజపుత్రిక వెఱచుచు హేమా ఆ సమయంబున తలిదండ్రు లిక్కడకు రానేల ? మన విషయమై గురువు లేవేని నేరములు చెప్పియుండలేదుగదా? అని పలికిన హేమ నవ్వుచు నిట్ల నియె. కాంతా ! నీవింత యెఱుఁగనిదాన వైతివేమి ? నీ తలిదండ్రులకు నీయందెట్టి ప్రేముం నదియో తెలిసికొనలేవు. లేక లేక కలిగినదానవగుటఁ దమప్రాణంబుల నీయం దుంచికొనియున్నవారు. "అత్యంత ప్రేమ, పాపశంకి" యను నార్యోక్తి వినియుండలేదా? నిన్నుజూచుటకే వచ్చియుండిరని చెప్పినది.

అప్పుడు సంతసించుచు నమ్మించుఁబోణి పూవులఁ గోయుటఁ జాలించి హేమతోఁ గూడ తలిదండ్రులయొద్ద కరిగెను. వారుద్ధవిడి నమ్ముద్దియను తొడపై నిడికొని దద్దయుం బ్రీతి ముద్దు వెట్టుకొనుచు పెద్దతడవు గారవించిరి. ఆభూతి దాపున నిలువంబడిన హేమఁ జూచి బాలికా! మీరు శ్రద్ధగాఁ జదువుకోనుచున్నారా యని యడుగుటయు నాచేడియ ప్రోడవలె వినయముఁ గనపరచుచు నయ్యగారూ! మేము శ్రద్ధగానే చదువుకొనుచుంటిమి. మా యుపాధ్యాయుల నడిగి తెలిసికొనుఁడు అని యుత్తరము సెప్పినది. దానిమాటలకు మిక్కిలి సంతసింపుచు నతండు హేమా! నీ సఖురాలికి వివాహముఁ జేయవలసియున్నది. పుడమిగలరాజపుత్రుల చిత్రఫలకములెల్లఁ దెప్పించితిని. వానిని నీవు చక్కగా విమర్శించి నీవయస్య కే రాజకుమారుం