Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్వయంప్రభ కథ

15

డనుకూలుండో యేరికొనుము. అని పలుకుచుఁ దాఁ దెచ్చిన చిత్రఫలకముల నూరింటిని దానియెదుర వరుసగా నిలఁబెట్టించెను.

వారివారివృత్తాంతము లన్నియు నాపటములప్రక్కనే వ్రాయఁ బడియున్నవి. అప్పుడు హేమా వానినెల్ల సాంతముగాఁ బరిశీలించి చరిత్రాంశములనెల్లఁజదివి తలద్రిప్పుచు ఱేనితో నిట్లనియె. దేవా ! ఈభూవరసూనులలో నొక్కరుఁడును నావయస్య వరింపఁదగినవాఁడు కాడని నిరూపణపూర్వకముగాఁ దప్పులు పట్టినది. అప్పుడు రాజు మిక్కిలి వెఱఁగుపడుచు భార్యతో రమణీ ! ఇదియేమిచిత్రము ! ఇప్పుడు రాజ్యము సేయుచున్న చక్రవర్తులపుత్రుల చిత్రఫలకములన్నియుం దెప్పించి చూపితిమి. ఈ హేమ వీరికందరకుఁ దప్పులు పట్టినది భూమండలమున రాజ్యార్హుండైన మరియొక రాజకుమారుం డెవ్వఁడును లేడు ఇంకముందు జనించువారి బెండ్లి జేయుదమాయేమి? అనిపలుకుచు మరల హేమతో బోటీ! నీమాటలు గడువింతలుగా నున్నవి. నీవు చూచిన వారలందరూ యువరాజులు. ముందు రాజ్యములు వీరికి సంక్రమింపఁగలవు. ఎవ్వఁడును బనికిరాడని నిరసింపఁదగదు! వీరిలో మంచివాని నేరికొనుము. బ్రహ్మసృష్టిలో లోపములేనివారుందురా నిదానించి మరలఁజూడుమని పలికిన విని యా కలికి మరలవిమర్శించి చూచి దేవా? తమ రేమనినను లెస్సయేగాని నావయస్య వీరిలో నొక్కరిని వరింపదని చెప్పినది.

అప్పుడు రాజు మిక్కిలి యక్కజఁబడుచు ముక్కుపచ్చలారని దాని నిన్నేరికొమ్మనుట మాదియే తప్పు. కానిమ్మని మరికొన్ని పటంబులఁ దెప్పించి చూపుచు వీరింగూడఁ జూడుము. వీరు రాజ్యార్హులు గారు, రాజవంశసంజాతులు. వీరిలో నెవ్వఁడైన నీకునచ్చునేమో చూడుమని పలుకుచు మరికొన్ని పటములిచ్చెను. అప్పుడు హేమ యా ప్రతిమలన్నియు నేరి చూచి చదివి యొకచిత్తరువుపై గురుతువెట్ట యీతండే నా సఖురాలు వరింపఁదగిన రాజపుత్రుఁడని పలికినది.

ఆ మాట విని సాక్షేపముగా నా క్షితిపతి యవిక్షేపముఁ గావించుచు వీఁడు భూరిశ్రవుఁడను నృపతికి నాలుగవకుమారుఁడు. వీనికెప్పటికిని రాజ్యాధికారమును గలుగనేరదు. ఇట్టివానింజేపట్టి నాపట్టిసామాన్యవలెఁ గష్టములఁ బడగలదా? సామ్రాజ్య పట్టభద్రునికిగాని నాముద్దు పట్టిం బెండ్లి సేయను సంపదలేనివాఁ డెట్టిరూపవంతుఁడైనను కురూపియగు ఎట్టి విద్వాంసుఁడైనను యధాజాతుఁ డనిపించుకొనును. ధనవంతుఁడే కులీనుఁడు. భాగ్యవంతుఁడే పండితుఁడని యెన్నియో దృష్టాంతరములు సెప్పి హేమను మాటాడకుండఁ జేసెను. అతని మాటలు తనకుఁ దృప్తికరముగా లేకున్నను ప్రభువని తలంచి మారు మాటఁ జెప్పినదికాదు. ఆ సంవాదము జరుగునప్పుడు స్వయంప్రభ కన్నులు మూసికొని యెద్దియో ధ్యానించుచుండెను. అప్పుడు రాజు పుత్రికంజూచి కన్నతల్లీ! కన్నులు మూసికొనియెద వేమిటికి? నీ సఖురాలి యనుమతియే నీయనుమతియా యేమి? చెప్పుమని యెంతయో లాలించి యడిగెనుగాని