పుట:కాశీమజిలీకథలు-06.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

యేమియు సమాధానముఁ జెప్పినదికాదు. కన్నులెత్తి యాచిత్రఫలకములం జూచినది కాదు. అతండు మరియుంబుజ్జగించి యడుగుచుండ వారించుచు రాజపత్ని పోనిండు. ఇప్పుడు వచ్చిన తొందరయేమి? మనమిప్పుడే పెండ్లి చేసితిమా? దీనికి మొదటినుండియు సిగ్గు మెండు. నాతోనైనను దలయెత్తి మాట్లాడదు. అని పలికిన విని యన్నరపతి సతీమణీ ! అట్లయిన నీవు మెల్లగా బోధించి దీని వాంఛితమెద్దియో తెలిసికొనుము ఆపగిదిఁ గావించువాఁడనని చెప్పి యతండు విహారార్ధమై యరిగెను.

పిమ్మట రాజపత్ని పుత్రికను బలుగతుల లాలించియు, బుజ్జగించియు, బోధించియు బ్రతిమాలియు మంచలించియుఁ గోపించియు నడిగినది. ఆ చిన్నది యేమియు మాటాడినదికాదు. అప్పు డబ్బిసరు హాక్షి విసిగి హేమతో ఓసీ! నీయభిప్రాయమే నీసఖురాలి యభిలాష కాఁబోలును ! దానికిఁ దండ్రి విపరీతముగాఁ బల్కిరని మాటాడకున్నది. దానికింత కోపమేల? అతఁడే యిష్టమైనచో వానినే పెండ్లి సేయుదుమని చెప్పుము. పోనిమ్ము. వానికి రాజ్యములేకున్న మా రాజ్యమే యేలికొనఁగలడు. ఇంతకన్న నింకెవ్వరుండిరి. అనుటయు హేమ సంతసించుచు అమ్మా! ఆమాటయే నిక్కువము. ఆ రాజకుమారునియందు విద్యారూపములు స్తోత్రపాత్రములై యున్నవి. అయ్యగారు వానికి రాజ్యములేదని సంశయించుచున్నారు. పెద్దలకు మేమెదురాడ గలమా? అందులకే నా సఖురాలు మీమాటల కుత్తరము సెప్పినది కాదు. అని పలుకుచుండ విని స్వయంప్రభ కనులెఱ్ఱఁజేసి హేమపై వేడిచూడ్కులు నెఱయఁజేయుచు మూఢురాలా! నిన్నీమాట లెవ్వరు చెప్పమనిరి? పోపొండు. నాకెక్కడి పెండ్లి? అని పలికి యలుకతోఁ జివాలున లేచిపోయినది.

అప్పుడు హేమ రాజపత్నితో అమ్మాః స్వయంప్రభకు పెండ్లి యందే యిష్టము లేదు. స్వయంప్రభవలె నొకయాశ్రమముఁ గల్పించుకొని యోగినివేషముతోఁ దపము చేసికొనవలయునని యభిలాషగా నున్నదఁట. ఆకోరిక నాతోఁ బలుమారు చెప్పుచుండ తగదని మందలించుచుంటిని. ఇప్పు డయ్యగారు చెప్పినమాటవలన మఱియుం గినుకఁ జెందినది. నేను మెల్లగాఁజెప్పి యడిగి కోరికఁ దెలిసికొనియెద. మీరిప్పుడింటికి జనుడని నుడువుటయు రాజపత్ని సంతసించుచు పరిచారికలతోఁగూడ శుద్దాంతమున కరిగినది.

తరువాత హేమ స్వయంప్రభను గలిసికొని సఖీ! ఆచిత్రఫలకముల నీవు చూచితివికావేమి ? అందు నేనిరూపించిన రాకొమరుండు కడు సుందరుఁడుసుమీ అన్నన్నా! విధి వానినే నీకుఁగూర్చిన కడుస్తోత్రపాత్రుఁడుగదా! వానికి ప్రాయముకన్న విద్య పెద్దది. మీతండ్రి నిన్నడిగిన వానినేకాని యితరుని వరింపనని గట్టిగఁ జెప్పవల ముంజుమీ! రాజ్యవైభవముల కాసపడి విద్యాహీను గోరికొనరాదు. అని యేమేమో చెప్పుచుండ వినియు విననట్లు పెద్దతడ వూరకొని వేడినిట్టూర్పు నిగుడింపుచుఁ గొంత తడవునకు హేమ కిట్లనియె.