పుట:కాశీమజిలీకథలు-06.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్వయంప్రభ కథ

13

నామకరణము పెట్టి యద్దేవతయందుఁ దనకుగల భయభక్తివిశ్వాసముల నెల్లరకుఁ దెల్లముఁ జేసెను.

ఆ పాపయు శశిరేఖవలె దినదిన ప్రవర్థమానయగుచు నూత్నరు చనిచయ విశేషంబులం బొలుపొందుచుండెను. తల్లిదండ్రులు సంతత మా పుత్రికారత్నముపై ప్రాణములు పెట్టుకొన పోషించుచుఁ దద్రూపాతిశయములకుం దగినవిద్య యుండవలయునను తలంపుతో నుపాధ్యాయులఁ బెక్కండ్ర నియమించి విద్యాభ్యాసము సేయించుచుండిరి. మరియు నంతియ ప్రాయముగల హేమయను బాలికను స్వయంప్రభకు సఖురాలిగను, సహాధ్యాయినిగను, పరిచారికగను నియమించిరి. ఆబాలిక లిరువురు నేక దేహమున పొలిక నత్యంత స్నేహవాత్సల్యములతో నాహార శయ్యా విహారంబుల మెలంగుచుండిరి.

గురువులా బాలికలకుఁ గ్రమంబునఁ గావ్యములను, నాటకములను, పురాణములను పాఠముచెప్పి శాస్త్రములయందుఁ బ్రవేశముఁ గలుగఁజేసిరి. స్వయంప్రభ యుపాధ్యాయులవలనఁ దాను స్వయంప్రభా దేవివరంబునఁ బుట్టినట్లు తెలిసికొని రామాయణమునందలి యా కథను పలుమారు చదువుచు హేమతో ముచ్చటింపుచు స్వయంప్రభాదేవి మహాత్మ్యమును గొనియాడుచు సామర్ధ్యము నగ్గించుచు నీమంబుల స్తుతిఁజేయుచుఁ ద్రికాలములయందును నక్కథయే పారాయణ సేయుచుండెను.

ఒకనాఁడు పూవులు గోయుచున్న సమయంబున హేమకును స్వయంప్రభకు నిట్లు సంవాదము జరిగినది.

హేమ — అక్కా ! నీవు సంతతము స్వయంప్రభాదేవి చరిత్రయే చదువుచుందువని గురువులు కోపము జేయుచున్నారు. చదువవలసినవి పెక్కులున్నవిగదా !

స్వయం — హేమా ! ఇఁక మనము చదువవలసిన వేమియున్నవి ? కావ్య నాటకాలంకార గ్రంథములు చదివి విడచితిమి శాస్త్రముల నెఱింగితిమి. పురాణ గాధల నాలకించితిమి. ఎన్ని చదివిన నేమి? వైరాగ్యప్రవృత్తి గలుగవలయును గదా?

హేమ — అయ్యారే ! కావ్యాదులఁ జూచి విడిచితిమని హేళనగాఁ బలుకుచుంటివి !ఎన్ని యేండ్లు చదివినను జదువవలసినదే ! వానికి బర్యవసాన మెక్కడ !

స్వయం — సఖీ! కావ్యనాటకాదులయందు నాకభిరుచి యేమియును లేదు.

హేమ — వానిభావము నీకుఁ దెలియక యట్లనుచున్నావు. ఆహా ! తద్రన మాధుర్యము సుధను మరపించును గదా!

సయిం — హేమా! తద్రనము నేను చవిగొననిది కాదు. నాకా రసము విరసముగా నున్నది.

హేమ — అమృతము నేవగించువా రుందురా !

స్వయం — అమృతమో విషమో నాకుఁదెలియదు. కావ్య నాటకాదుల యందు శృంగారరసము రససార్వభౌమమని కొనియాడుచు, మూత్ర పురీషాదులచే