Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

దేవి పేరు. బగడనగా మగఁడు. బరగ డన భర్గుఁడు. పెండలమన పెండ్లాము. బర్ర యన భార్య. వీరి మాటలు విన నెట్టివారికిని నవ్వు రాకమానదు కదా!

రాజ - సరిసరి ! ఇదియా ! ఈ మాటలకే యింత వ్యాఖ్యానము కావలసి వచ్చినదే! ఇఁక మనమడుగవలసిన విషయము లెట్లు తెలిసికొననగు? నీవే తెలిసికొని నాకుం జెప్పుమని నియోగించుటయు పుష్కరిణి యవ్వికృతభాషతోనే వారినడిగి స్వయం ప్రభాదేవి మహత్మ్యమంతయుం దెలిసికొని పారితోషిక మిచ్చి యంపినది. తరువాత రాజపత్నితో నమ్మా! వీరు చెప్పినమాటల నద్దేవిప్రభావమునఁ దెల్లమైనది. అది యసత్యముకాదు. నీవు మగనితో నొకరేయి నాగుడిలో జాగరము సేయుము. తప్పక కామిత మీడేరఁగలదు అని నిర్బంధించెను. వల్లెయని యప్పల్లవపాణియు నింటికిఁబోయి వల్లభునితో సంతతి గురించి ముచ్చటింపుచుండ ప్రసంగవశంబున నతండామెతో కాంతా సంతతివిషయమై నీవు గావించు కృత్యములన్నియు ముగిసినవియా? ఇంక నేమేనింగలవా? స్త్రీచాపల్యంబునం జేసి వెఱ్ఱిప్రయత్నములఁ జేసితివి అని పరిహసించుటయు నామె మగని కిట్లనియె.

ప్రాణేశ్వరా ! నేను మిమ్మిందులకై కడు బడలఁజేసితినని లజ్జించుచుంటి. ఇఁకఁ గడపటి యభిలాష యొక్కటిగలదు. అదియుం దీర్చినఁ నిక మిమ్మెప్పుడును నెపపెట్టఁబోను. అని స్వయంప్రభాదేవి వృత్తాంతమంతయుం జెప్పినది. అతండును నక్కార్యంబునఁ దనకు విశ్వాసము లేకున్నను భార్య నాశ్వాసించు తలంపుతో వేఁటనెపంబున నొకరేయి నుచితపరివారములు సేవింప భార్యతో స్వయంప్రభాదేవి యాలయంబున కరిగి భార్యచెప్పినచొప్పున నందు నియమంబులం గావించి యొరు లెఱుంగకుండ నింటికింజని యొండొకనెపంబున బ్రాహ్మణసంతర్పణ గావించెను.

అమ్మహాశక్తి శక్తియెటువంటిదో వెంటనే యవ్వాల్గంటికి గర్భిణీచిహ్నములు పొడచూపినవి సహజలావణ్యపూర్ణంబగు మొగంబున వింతకాంతి యొప్పుచుండ నొండు రెండు దివసంబులు పరిశీలించి మించు బోణులు దౌహృదలక్షణంబులని నిరూపించిరి. అన్ని రూపణము బాలిండ్లవై పు దిరపరుపఁ బెనుమురిపెముతో నత్తెఱవ మఱియొకనాఁడు వేడుకపడి లజ్జాసముద్రమునం దేలియాడుచు నత్తెఱంగెఱింగించి మనోహరుని సంతోషసాగరమున మునుఁగఁజేసినది.

ఇంద్రమిత్రుఁడు దేవతల నిందించిన నోటితోడనే స్తుతియింపుచు స్వయంప్రభాదేవియాలయ ప్రాకారమంటపాదులఁ గాంచన మయములుగా నిర్మించి చంద్రోదయమునకు సముద్రుండువోలె బుత్రోదయమున కెదురు చూచుచుండెను. అంత నవమాంసాంతమున మనోహారిణీ యాఁడుశిశువుం గనినది. ఆ వృత్తాంతము విని ధరణికాంతుం డర్దసంతోషంబుతో నర్దుల కర్దంబులు బంచి పెట్టించెను. సూతికాగృహంబున రత్నకళికవలె మెఱయుచున్న యబ్బాలికం జూచి పూఁబోణులక్కజం బడఁ జొచ్చిరి. తరువాత నాభూనేత కూతునకు జాతకర్మానంతరము స్వయంప్రభయను