స్వయంప్రభ కథ
11
ఓసీ పుష్కరిణి ! నీకీవెఱ్రి యింకను బోలేదా? చాలుఁజాలు. నాకీ జన్మమునకు సంతతిఁ గలుగదు. ఇంతకుమున్ను మనమారాధించిన వేల్పులకన్న నీదేవి మిన్న దైనదా? మనపురాకృతము వేరొకరీతి నుండ వేల్పు లేమిచేయగలరు? పోనిమ్ము. ఆ ప్రయత్నములిఁకఁజేయఁ దలంచుకొనలేదు. నియమముల మాటఁ దలపెట్టిన నయ్యగారి కెట్టికోపము వచ్చుచున్నదో చూచుచుండలేదా? పాప మాయన యేపాప మెఱుంగక సంతతి గలుగునని మనము చెప్పిన నియమము లన్నియుఁ జేసి శరీరమాయాస పరచికొనిరిగదా ! అక్కటా! ధాత్రీపతి నాటి శివరాత్రి గాలకంఠునిగుడిలో నాఁడుదాని వలెఁ ప్రాణాచారమువడిన తెఱంగుఁ దలంచుకొన విషాద మగుచున్నది. అర్చకులకుఁ బారితోషిక మిచ్చి యంపుము. అని చెప్పిన విని పరిచారిక వెండియు నిట్లనియె.
దేవీ! నీ వనినమాట సత్యమే: కాని యేసమయమున కెట్లుజరుగునో యెవరు నిశ్చయింపగలరు. ఒకసారి చేసిన ప్రయత్నంబు నిష్ఫలం బైనను మఱియొకప్పుడు చేసిన సఫలమగుచుండును. దశరథున కెన్నియేం డ్లకు సంతతిఁ గలిగినది. కావున నావిషయ మవిచారణీయమైనది దీనమనకు వచ్చినకొదవ లేదు. వారివలనఁ దచ్చరిత్ర మెట్టిదియో విని పిమ్మటఁ గర్తవ్యమేమియో విచారింతముగాక యని చెప్పుటయు నప్పఁడతి యర్ధాంగీకారముగా నూరకొనియెను. పిమ్మట నాకొమ్మ వేఱొక పరిచారికం బంపి యాయర్బకుల రప్పించినది. వారి వికృతరూపములఁ జూచి నవ్వుచు రాజపత్ని యర్బకురాలితో నిట్లు సంభాషించెను.
రాజపత్ని - ఓసీ ! నీ పేరేమి?
అర్బకురాలు — అమ్మా ! నా పేరు దురద.
రాజ — (నవ్వుకొనుచు) అది యేమి పేరు ?
అర్బ - అమ్మా: సంపబ్బ పేరు.
రాజ - వాఁడు నీ కేమి కావలయును ?
అర్బ - బగడు.
రాజ — (నవ్వుచు మగవానితో) ఓరీ! నీపేరేమి?
మగ - నా పేరు బరగడు.
రాజ — ఇది నీ కేమగును?
మగ - ఈ దురద నాకు పెండలము.
పుష్క - (నవ్వుచు) దురదకందకుగాని పెండలమునకుండుదురా
మగ — అయ్యో ! సానీ ! ఇది నా బర్రమ్క.
రాజ - (పుష్కరిణితో) వీరిమాటలు నీకేమైన తెలిసినవియా !
పుష్క - (నవ్వుచు) తెలిసినవి. తెలిసినవి. వీం డ్రాటవికులగుట గ్రామ్యభాషయైనను జక్కగా మాట్లాడలేరు. దురదయనఁగా దుర్గ. సంపబ్బ పేరన స్వయం ప్రభా