స్వయంప్రభకథ
గిరిదుర్గంబను బట్టణంబున నింద్రమిత్రుఁడను రాజు మనోహారిణీ యను భార్యతోఁ బ్రజలఁ బ్రజలపోలికం జూచుచు ధర్మంబునఁ దొంటి నృపతులంబోలి రాజ్యంబు సేయుచుండెను. అమ్మహారాజు ప్రాయంబున నపత్యరహితుండగుట సామ్రాజ్యసుఖంబు సంతోష విముఖంబై క్రమంబున విషసబంబై యొప్పుచుండఁ దత్ప్రాప్తికై పత్నితోఁగూడ నెన్నియేని దానంబుల, వ్రతంబుల, యాగంబులం గావించియుఁ గృతార్ధత వడయఁడయ్యెను. కనబడిన వేల్పు నర్చించుచు, వినంబడిన వ్రతము నాచరించుచు, చెప్పిన దానంబులం గావించుచు యాత్రల కరిగి, నదుల మునిఁగి, తీర్థములఁ దిరిగియు సార్థకముగానక మనసువిఱిగి చివురకద్ధరణీపతి ధర్మంబున నిందింప దొడంగెను. వ్రతంబుల నేవగింప మొదలుపెట్టెను. యాగంబుల నిరసింపఁ బ్రారంభించెను. పుణ్యకార్యంబులఁ దల పెట్టినవారిం బట్టికొని శిక్షింపఁ దొడంగెను. మఱియు,
ఉ. తా నిల నెవ్వఁ డెట్టి నియతక్రియనైననుఁ బూని నాకు సం
తానము గల్గఁజేసి ముదంబున నాతని నర్దనాయకుం గా
నొనరింతుఁ దప్పి యటుగాక వృధా నను ఖేద పెట్టినన్
వాని శిరంబుఁ ద్రెంచి పురివప్రముఖంబునఁ గట్టఁ బుచ్చెదన్.
అని యొకశాసనము వ్రాయించి యిదియెల్లరుఁ జూచునట్లు గోపుర ద్వారంబునం గట్టించెను. ఆ ప్రచురము విని యెవ్వఁడును నప్పనికి బూనికొనఁ డయ్యెను.
కొంతకాల మరిగినంత నొక వసంతకాలంబున రాజపత్ని పుష్కరిణియను పరిచారికం గూడికొని దేవీపుష్కరిణియను తటాకాంబున కరిగి యందు తీర్థం దాగి కొంతదనుక గురుదత్తుంబను మంత్రంబు జపించి మరల నింటికిం బోవుసమయంబునఁ బరిచారిక యరుదెంచి యిట్లు విన్నవించినది. దేవీ! మనపురి కనతిదూరంబున రత్నకూటంబను గిరివరంబుఁ గలదు. అన్నగరశిఖరంబున దేవతలు విహరింతురను వాడుక యున్నది. రామాయణకథయందు హనుమదాది వానరులు ప్రవేశించిన స్వయం ప్రభాదేవికందర మం దున్నదని పెద్దలు వక్కాణింతురు. అందులకు నిదర్శనముగా నగ్గిరిపాదంబున స్వయంప్రభాదేవి దేవళ మొకటి విరాజిల్లుచుండెనఁట. అద్దేవీ ప్రభావం బాశ్చర్యకరమని వినుకలి గలదు. ఒకరేయి యిద్దేవళంబున దంపతు లుపవసించి జాగరము జేసి యర్పించిన నద్దేవి కామిత మీడేర్చునట అవ్వార్త నే నింతకు మున్నె విని యందలి విశేషంబులం దెలిసికొనఁ దదర్చకులకు సందేశ మంపితిని. వారును వచ్చియున్నారట. ముదలయేని యెదురకు రప్పింతుననుటయు మనోహారిణి నవ్వుచు నిట్లనియెను.