పుట:కాశీమజిలీకథలు-06.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శశాంకమకరాంకుల కథ

93

అయ్యడవి పందియు నాసుందరులును నత్తరు స్కందముచుట్టును గొరవి తిప్పినట్లు తిరగఁజొచ్చిరి. రాజుపుత్రిక చేతి దండతాడనములు లక్ష్యము సేయక నవ్వరాహంబు రూపవతిని విడువక తరుముచుండెను. అయ్యబల కొంతసేపు తిరిగి తిరిగి నిలువలేక యొడలుతిరుగ నలసటతో నిలువలేక పుడమింబడి మూర్చిల్లినది. అప్పుడా సత్వం బియ్యంబుజాక్షి వీఁపు పై గోళ్ళు నాటించి దండతాడన భయంబున నట నిలువక యవ్వలికిఁ బారిపోయినది. కళావతి కప్పు డట్టిబలమెట్లు వచ్చినదో తెలిసి కొనుట దుర్ఘటము.

అట్లు నేలంబడియున్న రూపవతింజూచి రాజపుత్రిక యురము బాదికొనుచు మొగమున మోముఁజేర్చి సఖీ ! రూపవతీ ! అని పలుమారు పిలిచియుఁ బ్రతివచనంబుఁ గానక సమసెఁగా నిశ్చయించి నేలంబడి హా ! ప్రాణసమప్రియా ! త్రిలోకసుందరీ ! నన్నీ యరణ్యంబునఁ బారవైచి నీవొక్కరితవు పరలోకమున కరిగితివా ? అయ్యో ? ఇంతకుముందే నేనధైర్యము పడుచుండ నాకెన్నియో మాటలు చెప్పితివే నీ యూహ లన్నియు నెందుఁబోయినవి. అక్కటా ! తలిదండ్రుల లెక్క సేయక గృహసుఖంబులఁ దృణముగా నెంచి నా వెంటనడవులకు వచ్చిన నీ విట్లు మృతినొందఁ గన్ను లార చూచి యున్నదాన నావంటి కృపనాత్మ యెం దైనంగలదా ! సేవించుక యలసిన పాదములొత్తుచు విసరుచు నాకలిఁ దీర్చుచు నెన్నియో యుపచారములు సేయుచుందువు. ఇప్పుడు నా ముపచార మొక్కటియుం గొనవేమిఁ ఇది సహవాసధర్మమే. తల్లీ ! చూడుము. మాట్లాడుము. నేనుగూడ నీతో వచ్చుదాననే. ఇంచుకసేపు నిలువుము. ఆపాదవగాహము నాపైబడక నిన్నేమిటికిఁ దరిమి నది. అట్లయిన నీచావు నేను చూడక పోవుదునుగదా? అని దెసలు ప్రతిద్వను లిచ్చునట్లు యేడ్చుచు రూపవతిపైఁ బడి యవయవముల ముద్దిడుకొనుచుఁ గౌఁగలించుచు మరల మరలఁ బిలుచుచు నిరీతిఁ గొంతతడవుఁ గడిపినది.

కొంతదరి కత్తలోదరి యదటుదిగి మెల్లనఁ గన్నులుఁ దెరచి కరసంజ్ఞచే శోకింపవలదని తెలుపుచు దాహముఁదెచ్చి యిమ్మని సూచించినది. ఆ సన్న గ్రహించి యాపన్న గవేణి యుబ్బుచు గొబ్బునలేచి లేడివలె మిట్టపల్లంబుల గణింపక దుముకుచు ముల్లుకంపల గణింపక నెగురుచు మృగబాధ తలంపక జలంబులదేర నూరక పరుగిడుచుండెను.

మరియు నొకతెరవునుండి వేరొక తెరవునకుం బోవుచు బల్లంబులఁ బరిశీలింపుచుఁ గోనల విమర్శింపుచు నిట్లు పెద్దదూరము తిరిగినది. నీటిజాడయేమియుం గనంబడినదికాదు అప్పుడు మిక్కిలి పరితపించుచు అయ్యో ! నే నింత వెర్రిపని చేసితినేమి? నే నేమూలనుండి వచ్చితినో యించుకయు గురుతు తెలియకున్నది. చాల దవ్వరుదెంచితినని తోచుచున్నది. జలములు దొరకలేదు. అందుఁగూర్చుండి యుపచారమైనఁ జేయక ప్రాణసఖి విడిచివచ్చితినికదా. ఆహా ! మోసపోయితిని వేగమచ్చటికే