పుట:కాశీమజిలీకథలు-06.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

అప్పుడుమిక్కిలి భయఁపడుచు గుండెలు రాయిచేసికొని యొకచెట్టుక్రిందఁ బండుకొని యెట్టకేఁ దెల్ల వార్చిరి.

అట్లు వారు నాలుగుదినములు పయనము సాగించిరి. అయ్యరణ్యమునకు నాద్యంతములు కనంబడలేదు. పోయినకొలది యగమ్యగోచరముగాఁ గనంబడు చుండెను. ఆహారపదార్ధములు సరిపడినవి. పాదములు పొక్కులెక్కినవి. నాలుగవ నాఁడు జాము పొద్దెక్కినప్పుడు అడుగులు తడఁబడ నీడ్చుచు నొకతరువునీడఁ జతికిలపడి నిట్టూర్పులు నిగిడింపుచు మోమునం గ్రమ్మినఁ జెమ్మటఁ బైటచెఱంగున నద్ది కొనుచుఁ గళావతి రూపవతి కిట్లనియె.

సఖీ ! మనము విద్యామదము యౌవనమదముతో వియ్యమందఁగా వరించి యింటికడ సుఖం బుండనేరక వెడలి వచ్చితిమి. చివరకు మన జీవితాంత మీ విపినా నంతరమున జరుగునట్లు తోచుచున్నది. అడుగు నడుచుటకు శక్తిలేదు. ఇంతయడవి యున్నది. తినుట కేమియుం దొరకదు. దారి కాని దారింబడితిమి. కౄరమృగముల యార్పుల వినంబడుచున్నవి. నేడుగడుచుట గష్టముగాఁ దోచుచున్నది మనమించుకయు నాలోచింపక బాల్యచాపల్యంబున వట్టి చెడుప్రయత్నముఁ జేసితిమిసుమీ ? యని యధైర్యముఁజెంది శోకోపహతచిత్తమైయున్న యమ్మత్తకాశిని నూరడించుచు రూపవతి యిట్లనియె.

ప్రియసఖీ ! జీవులకు రెండుచావులు లేవని మనము చదివితిమిగదా? అకాలమున మరణము రాదనియు మన మెరింగిన విషయమే. ఇఁక విచారమేమి? అదిగో యీప్రాంతమున ఫలవృక్షము లేవియో యున్నవి. పోయి ఫలములంగోసికొని వచ్చెద నిందుఁగొంతసేపు విశ్రమింపుము. చింతింపకుమని బోధించి యా మించుబోణి నలుమూలలు దిరిగిఁ వెలగపండ్లుఁ గోసికొని వచ్చినది. పండ్లుతిని యా రాచపట్టి యాకలి యడంచుకొని రూపవతి ధైర్యసాహసాదుల మెచ్చుకొనుచు దమపయనము విషయమైన యాలాపములు ముచ్చటింపుచున్నది.

ఇంతలో నొకదెస నేయుఁడు ! కొట్టుడు ! పట్టుడు ! పొడువుడు ! అను కోలాహలధ్వనియొకటి దూరముగా వినంబడినది. ఆ రొదవిని యమ్మదవతి లదరిపడుచు లేచి మృగముల కేకలువలె వినంబడుచున్నవి. పలాయమానంబులగు జంతువు లిందు రాగలవు.మనము కాచుకొని యుండవలయునని యాలోచించుచున్నంతలో నొక వరహ మాప్రాంతమునకుఁ బారివచ్చుచున్నట్లు కనంబడినది.

దానింజూచి యా చిగురుబోణు లిరువురు చెరియొకదెశకుఁబారిపోవ యత్నించు చుండ నక్కిటివరంబు పటువేగంబున నరుదెంచి రూపపతి వెంటఁబడి తరుముచుండెను. ఆబాల కోలముకందక నొక మాను చుట్టుదిరుగుచుండెను. ఆ యుపద్రవముఁ జూచి రాజపుత్రిక వెరువక సాహసముతో నొకబడియఁ దీసికొని యాపోత్రిం బెదరించుచు వెన్నంటి తరుమ మొదలు పెట్టినది.