పుట:కాశీమజిలీకథలు-06.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శశాంకమకరాంకుల కథ

91

తండ్రి కెఱింగింప మనము స్వతంత్రులమై కులపాలికా విరుద్ధముగా నిల్లు వెడలి వచ్చితిమి. ఇదియంతయు దైవమాయవలె గనంబడుచున్నది. మనకొరకు తల్లిదండ్రులు దుఃఖించుచుందురు. వెండియు నింటికిఁబోయిన లెస్సయగునేమో యాలోచించి చెప్పుము. నాకేమియుం దోచుకున్నది, అని యడిగిన కళావతికి రూపవతి యిట్లనియె.

సఖీ ! కళావతీ ! నీవనినట్లు మన ప్రయత్నమంతయు నిరర్ధకమైనదే అయినను నిప్పుడు పశ్చాత్తాపపడినఁ బ్రయోజన మేమి? మనమిప్పుడింటికింబోయి నిజమెఱింగించితిమేని ప్రజలును బంధువులును జాల నిందింతురు మరియు రాజదండనకుఁ బాత్రుల మగుదుము. మనకట్టిబుద్ధి పుట్టించిన భగవంతుని యెత్తికోలు సఫలము చేయవలయును. దైవము పంచినట్లు నడుచువారము గాక మనము స్వతంత్రులమా ! లెమ్ము. వెరవకుము. ధైర్యమూనుము. తూరుపుదెసకరిగి సఖురాండ్రం గలసికొని కొంతకాలము దేశాటనము చేయుదముగాక పురుషవేషములు వైచితిమిగదా? మనల నెఱుఁగువారుండరు. మన మొండొరులమే గురుతుపట్టుట దుర్ఘటముగానున్నది. నీ పేరు శశాంకుఁడనియు నా పేరు మకరాంకుఁడనియుఁ జెప్పుకొందుము. మన విద్యల దేశ యాత్రచేఁ గృతార్ధములఁ చేయుదుము. అని యత్యంత సాహసోత్సాహములతోఁ బలికిన విని కళావతి యిట్లనియె.

చెల్లీ ! మనకు బాల్యము వదలుచున్నది. యౌవనారంభమున మనలఁ గారా గారంబులంబోని యంతఃపురంబులు ప్రవేశ పెట్టుదురు. దేశములెట్లు చూడఁగలము, కావున మననడక యొక తెరవున ననువైనదనియే దలంపవలయును. నీ పలుకులచే నాయెడఁదఁ గలకతీరినది పయనము సాగింపుము. యానసాధనములు వికలమైనవి. గావున నిఁకపదములచేతనే నడువవలెను. తొలుతఁ దూరపుదెసకరుగుదము. సఖులు తూరుపు మార్గముననే యుందుమని చెప్పిరిగదా ! ఆదెస నడవులు మెండుగలవని చెప్పుదురు. మొదట నత్తె రంగెఱుంగక వారి నాదెస పోవలయునని మనమే చెప్పితిమి. ఎట్లయినను నట్లుపోవక తప్పదు. అని యుపన్యసించినది. అట్లిరువురును తలంచుకొని యాదారి విడిచి తూరుపుదెసకు మరలి నడువందొడంగిరి అప్పటికి జాము ప్రొద్దెక్కినది. ఖరఖఁరుడు తనవేడి కిరణములచేఁ గ్రమంబు జగంబునఁ బరితపింపఁ జేయఁదొడంగెను. అయ్యండజగమన లాయెండలో నడువలేక మ్రానునీడలనిలుచుచు మరల నడచుచు నీరీతిఁ గొంతపయనము సాగించిరి. మిట్టమధ్యాహ్నమున నొక చెట్టునీడ వసించి తాను దెచ్చుకొనిన యాహారపదార్ధములు భుజించి యాకలి యడంచుకొనిరి.

చండభానుఁడు కొండొకదూర మరిగిన మరల నడువ మొదలు పెట్టిరి. క్రమంబుననాయడవి బలియ చున్నది కాని తెరపి కనంబడుటలేదు. సాయంకాలమున ------------------దలఁచి వడివడి నడిచిరి. పల్లెయేదియుం గనంబడినదికాదు.