Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

సోమభట్టారకుఁడు అయిదుదినములు వెనుకటికన్నఁ బెద్దగా నుత్సవములు కావించెను. దీక్షావసానంబున సత్యవతిరూప మెట్లుమారునో చూడవలయునను తలంపుతో బంధువులందరు వేచియుండిరి విద్యాభాస్కరుఁడును సోమభట్టారకుడును గులదేవతను బ్రార్ధించుచు సత్యవతిరూప మిమ్మని గోరికొనిరి. అప్పుడు మరల భట్టారకుని భార్య యావేశముఁ దెచ్చుకొని బాలిశుఁడా ! నీవు పండితుండవయ్యు దేవతా మహిమ యించుకయు దెలిసికొనలేక పోయితివి. నన్ను క్షుద్ర దేవతవలెఁ బూజించితివి. అనాచారములు చాలఁ గావించితివి. ఇఁక నాకు నీ యందుఁ గనికరము రాదు. నీ కూఁతురీ జన్మమునందిట్లే యుండును. పో పొమ్ము అని పలికి నిందింప దొడంగినది. భట్టారకుఁడనేకముగా నపరాధములు సెప్పు కొనియెంగాని ప్రత్యుత్తర మిచ్చినది కాదు అప్పుడతండు గోలు గోలున నేడ్చుచు అయ్యో ! నా పుత్రిక యిట్లువికృతాంగియైన నెవ్వరు భరింతురు. దీనికాల మెట్లు గడచును? దిక్కెవ్వరు? అని యూరక పలవరించుచుండ నల్లుడతని చేతులు పట్టుకొని మామా? దుఃఖింపకుఁడు. కట్టికొనినందులకు దీని కష్టము లన్నియు నావికాక మీకేమి భారతము, భారమంతయు నామీదఁ బడినది. స్వతంత్ర ప్రేమతోఁ జూచుచుండెదను దైవికమునకు మన మేమిచేయఁగలము. అని ప్రమాణికము చేయుదనుక నతండేడ్పు మానలేదు. యజ్ఞదత్తుండును అతని దుఃఖముఁ జూచి అయ్యో ! నే నెక్కడికి వచ్చిన నక్కడనే కష్టములు గలుగుచున్నవి. ఇందుండనని భట్టారకునోదార్చి తానచ్చటఁ గదలి భార్యతోఁగూడ నెందేనిం జనియెను.

అని యెఱింగించువరకుఁ గాలము మిగులుటయుఁ గథఁజెప్పుట మానివైచి మణిసిద్ధుండు తదనంతర వృత్తాంత మవ్వలి యవసధంబునఁ జెప్ప దొడంగెను.

డెబ్బదియవ మజిలీ.

శశాంకమకరాంకుల కథ

సఖీ ! రూపవతీ ! మన మిల్లు వెడలి మూడుదినములయినది. యంత్రయానమునఁ బెద్దదూరము వచ్చితిమి. ఆ బ్రాహ్మణదంపతు లెందును గనబడలేదు. ----------- దోవంబోయి యుందురు మనమిఁక నీదారింబోవుటమాని తూరుపుగా బోవుదము . మనసఖురాండ్రు మనకై వేచియుందురు. అయ్యో ! మనము వత్తుమన్న దినమునకుఁ బోలేక పోయితిమిగదా ? వారేమి చేయుదురో తెలియదు మన మొండొరులముఁ గలసి కొనక చిక్కులు పడియెదవేమో ? ఆహా ! బుద్ధిః కర్మానుసారిణి యను వచనము సత్యమగును. వారిరువురు పెండ్లి యాడుచుండ వారించి యద్భుత కల్పనలఁ జేయుటకు మన మిట్టి సంకల్పము పట్టుటకుఁ గారణమేమియో తెలియకున్నది. తలంచికొన నాకే విస్మయముగానున్నదిగదా? పుత్రికకై శోకవార్ధిలో మునిఁగిన గురునోదార్చలేక పోతిమేల? ఆ దంపతుల గర్భశోక మూరక చూచుచుంటిమిగదా ? పోనిమ్ము. పిమ్మటనైన మా