Jump to content

పుట:కాశీమజిలీకథలు-06.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(12)

సత్యవతి కథ

89

ఎందును గుప్త వర్మయుఁ గృతవర్మయుంగూడ? గనఁబడలేదు. భార్య నడిగిన నామె నాకేమియుం దెలియదని చెప్పినది. అతం డొక్కింతతడవు విచారించి భార్యచెవిలో నేదియోచెప్పి మరల యజ్ఞదత్తు నొద్దకువచ్చి య మాటలే ముచ్చటించుచున్నంతలో నింటిలో కేకలు వినంబడినవి. ఆరొదయేమియో తెలిసికొని రమ్మని శిష్యునొకని నంపుటయు నతండు లోపలికివెళ్ళివచ్చి తొట్రుపడుచు నిట్లనియె.

పెండ్లిఁగూతురురూపు మారిపోయినది. చాల వికృతాకృతితో నొప్పుచున్నది. ఇసిరో ! చూచుటకే యసహ్యముగ నున్నది. మీరు సుముహుర్త మునకు ముందుఁ గులదేవత నారాధించినారు కారఁట. అద్దేవి కోపించి యిట్లు కావించితినని అమ్మగారి నా వహించి చెప్పుచున్నది. వేగరండని చెప్పెను.

అప్పు డదరిపడుచు సోమభట్టారకుఁడు యజ్ఞదత్తునితోఁ గూడ గృహాంతరమున కరిగెను. భట్టారకునిభార్య పరుషములాడుచుఁ దల విరియఁబోసికొని శివమాడుచు భట్టారకుఁజూచి కన్నులెర్రఁజేయుచు నోరీ ! మూర్ఖుడా ! చిరకాలము నుండి నీ కులము నాశ్రయించికొని నున్న దేవతను మరచితివిగదా? కానిమ్ము. ఇందులకుఁ బ్రాయశ్చిత్తము చేసితిలే చూచికొమ్మని పలుకుచు సత్యవతిని ముందరకుఁ ద్రోసినది.

ఆ సత్యవతింజూచి సోమభట్టారకుండు అయ్యో ! ఇది యెవ్వతే ? ఇది యెవ్వతే? అని వెఱగుపడుచుండ నిదియే నీ కూఁతురు. కోపమున నిట్లు కావించితినని పలికెను.

తల్లీ ! రక్షింపుము. రక్షింపుము. అపరాధులమైతిమి. బిడ్డపై దల్లి కోపించునా? నా చక్కనికూఁతు నాకిమ్ము. నీ చెప్పినయట్లు చేయువారము అని యనేక ప్రకారముల బ్రతిమాలఁ దొడంగెను. అంతలో బెండ్లికొడుకు ----------- యార్తిం జెందుచు నచ్చటికివచ్చి సత్యవతి వికృత రూపముఁ జూచి దుఃఖించుచుఁ గులదేవతను బెక్కురీతులఁ బ్రార్ధించెను. వారి ప్రార్ధనల మన్నించు నట్లభినయించుచు నాయిల్లాలు ----? మూర్ఖులారా! మీరు పండితులయ్యుఁ బామరులభంగి నన్ను మరచితిరి. ఇది మొదటి తప్పుగా మన్నించితిని రెండవ తప్పు మన్నించుదాననుగాను వినుండు. ముందుగా నన్నుఁ బూజించి సత్యవతికిఁ దిరుగాఁ బాణిగ్రహణవిధి యంతయుఁ జరుపవలయు. వివాహ దీక్షావసానమున నీ పుత్రిక యెప్పటిరూపుఁ జెందగలదు. ఇందెంత మాత్రము దురాచారము సోకినను మన్నించుదాననుగానని పలికిన విని విద్యాభాస్కరుండుబ్బుచు మామా ! ఇఁక లెండు. చింత యుడుగుఁడు. అమ్మవారికి దయ వచ్చినది. మరల నుత్సవములు సేసికొందము. దీన మనకు వచ్చిన కొఱంతలేదని చెప్పిన సంతసించించు సోమభట్టారకుండు తొలుత గృహదేవత నారాధించి తరువాత మరలఁ బాణిగ్రహణ మహోత్సవముఁ గావించెను. విద్యాభాస్కరుండు సత్యవతి మెడలో మంగళాసూత్రముఁగట్టి తలంబ్రాలు బోసి భార్యగా స్వీకరించెను.